Telugu News Power

అంతర్వేది నరసింహస్వామి చక్రస్నానం లో అద్భుత దర్శనం

గరుడ పుష్పక వాహనంపై చక్రస్నానికి భక్తజన సమూహంతో తరలి వెళ్తున్న స్వామి వారు
పేరూరి వారి శిరస్సు అధిరోహించి స్వామి స్నాన ఘట్టం

సఖినేటిపల్లి: ఫిబ్రవరి, 1(తెలుగు న్యూస్ పవర్) నవనరసింహ క్షేత్రాలలో ప్రముఖమైన అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణం ఉత్సవాల్లో భాగంగా, ఆదివారం,8వ రోజు శ్రీవారి సుదర్శనచక్రస్నాననం అత్యంత వైభవంగా జరిగింది. దేవాలయ చరిత్రలో జరగని ఓ అద్భుతం ఈ సందర్భంగా చోటుచేసుకుంది. స్వామివారు, సుదర్శన చక్రస్నానం కోసం, గరుడ పుష్పక వాహనంపై గ్రామోత్సవం చేసి సముద్ర తీరానికి చేరుకున్నారు. సరిగ్గా అదే సమయానికి నిచ్చలంగా, నిర్విహంగంగా, ఆకాశంలో అప్పటి వరకు ఒక్క పక్షి లేకున్నా, ఆకాశంలో నుంచి నిజమైన గరుత్మంతుడు వచ్చాడా అన్నట్టుగా, పక్షిరాజు ఎగురుకుంటూ వచ్చింది. చక్రస్థానం సమయంలో విహంగ వీక్షణలో స్వామివారిని దర్శించుకుంది. ఈ అపూర్వ ఘట్టం చూసిన భక్తులు తన్మయత్వంతో అలౌకిక, ఆధ్యాత్మిక ఆనంద పరవశులయ్యారు. ఇంతకుముందు ఇలాంటి పక్షిరాజం, చక్రస్నానం సమయంలో ఇంతవరకు ఎప్పుడూ ఇలాంటి దృశ్యం తమ జీవితంలో చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మాఘ పౌర్ణమి సందర్భంగా, ఆదివారం పౌర్ణమి స్నానం కోసం భక్తులు విశేషంగా తరలివచ్చారు. సుదర్శన చక్రం ధరించి స్వామి వారు చక్రస్నానం ఘట్టానికి తరలివచ్చారు. ప్రధాన అర్చకులు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్, స్థానాచార్య, వింజమూరు రామ రంగాచార్యులు, వేద పండితులు చింతా వేంకట శాస్త్రి, ఆధ్వర్యంలో పేరూరు ఉద్దండ పండితులు స్వామి వారిని తన శిరస్సుపై అధిష్టించుకుని సుదర్శన చక్రస్నానం సముద్రంలో చేయించారు. అలంకారమండపం నుంచి ఉదయం 8 గంటలకు ఉత్సవమూర్తులు గరుడ పుష్పక వాహనం పై సుదర్శన చక్రధారుడై నృసింహస్వామి, చక్రవర్తి పెరుమాళ్ స్వామిగా పల్లకిలో ఊరేగుతూ తీరానికి తరలి వచ్చారు. సముద్ర తీరం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పందిరిలో స్వామివారిని దేవేరులను అధిష్టింపచేసొరు. పంచామృతాలతో, నారికేళ జలంతో స్వామికి అభిషేక కార్యక్రమం నిర్వహించారు. అనంతరం నూతనంగా నిర్మించిన వసంత మండపానికి స్వామివారిని ఊరేగింపుగా తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అనువంశిక ధర్మకర్తలు, ధర్మకర్తల మండలి సభ్యులు, వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. చక్రస్నానం అనంతరం భక్తులు సముద్రంలో స్నానమాచరించారు.

శ్రీ చక్ర స్నానం సందర్భంగా విహంగ వీక్షణంతో స్వామివారిని దర్శించుకుంటున్న పక్షిరాజం