Telugu News Power

అంతర్వేది రథోత్సవం, భక్తజనుల కోలాహలం

స్వామివారి కల్యాణోత్సవం లో మాంగల్య ధారణ ఘట్టం

సఖినేటిపల్లి;జనవరి,29(తెలుగు న్యూస్ పవర్) అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణోత్సవం, గురువారం తెల్లవారుజామున అంగరంగ వైభవంగా జరిగింది. ఉగ్ర నరసింహ స్వరూపం గల,స్వామివారు పెళ్లి కళ సంతరించుకొని, పెళ్ళికొడుకై తరలిరాగా, లక్ష్మీదేవి అమ్మవారు, సిగ్గులొలుకుతూ, పెళ్లికూతురై వివాహ వేదిక చేరుకున్నారు. స్వామివారి కల్యాణ వేడుక బుధవారం రాత్రి గడియలు దాటి 1.56 గంటల ముహూర్తానికి గురువారం జీలకర్ర బెల్లం పెట్టే దృశ్యం చూసి భక్తులు తరించిపోయారు. మంగళసూత్ర ధారణ తదితర వివాహ క్రతువు పండితులు జరిపించారు. ఈ ఏడాది భక్తులు అశేషంగా తరలి రావడంతో, నేరుగా, కళ్యాణం వీక్షించలేనివారు, ఎల్ఈడి స్క్రీన్ పై చూశారు. వివాహ కార్యక్రమానికి అనువంశిక రాజ కుటుంబీకులు, స్థానిక ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, ఎంపీ హరీష్ మాధుర్, జిల్లా అధికారులు హాజరయ్యారు.

ఈ ఏడాది, రథోత్సవం చూడటానికి, గురువారం మధ్యాహ్న సమయానికి భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చారు. అత్యంత వైభవంగా అలంకరించిన రథంపై స్వామివారు అధిరోహించుగా, భక్తులు, భక్తిశ్రద్ధలతో రథోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా, భక్తులకు అన్న సమారాధన వివిధ సంఘాల వారు చేశారు. నర్సాపురంలో కొత్తపల్లి సోదరులు, మాజీ ఎమ్మెల్యే మాధవ నాయుడు, చించినాడ వద్ద భక్తులు, అంతర్వేది, స్వామివారి సన్నిధికి సమీపంలో ఎలమంచిలి కమ్మవారి సత్రం, అన్నదాన వితరణ చేశారు. ఈసారి ఆర్టీసీ భక్తులకు మెరుగైన ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఏడాది భక్తులు లెక్కకు అందనంత సంఖ్యలో వచ్చినట్టు దేవాలయ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.