పాలకొల్లు: మార్చి, 5(తెలుగు న్యూస్ పవర్. కామ్)
జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక శ్రీ ఏ.ఎస్.ఎన్.ఎం. ప్రభుత్వ (స్వయం ప్రతిపత్తి) కళాశాలలో మహిళా సాధికారత విభాగం, ఎన్.ఎస్.ఎస్. యూనిట్ – 1, 2, టౌన్ పోలీస్ స్టేషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థుల కోసం “మహిళా సాధికారత- సమాజ అభివృద్ధికి పునాది” అనే అంశంపై వక్తృత్వo మరియు ” డిజిటల్ యుగంలో మహిళల అవకాశాలు మరియు సవాళ్లు” అనే అంశంపై వ్యాసరచన పోటీల నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా. టి. రాజరాజేశ్వరి అధ్యక్షత వహించి మాట్లాడుతూ, సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని, మహిళా సాధికారత,సమానత్వం వల్ల అది సాధ్యమవుతుందని తెలిపారు. మహిళలకు అవగాహన పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని ఆమె పేర్కొన్నారు.ఈ సందర్భంగా, టౌన్ పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రజనీ కుమార్ మాట్లాడుతూ, మహిళల రక్షణ కోసం భారతదేశంలో అమల్లో ఉన్న వివిధ చట్టాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. గృహ హింస నిరోధక చట్టం – 2005, కార్యాలయాలలో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం – 2013, బాల్యవివాహ నిషేధ చట్టం – 2006 వంటి ముఖ్యమైన చట్టాలను వివరించారు. మహిళలు తమ హక్కులను తెలుసుకొని ఎలాంటి అన్యాయం జరిగినా భయపడకుండా పోలీసులను సంప్రదించాలని సూచించారు. మహిళల భద్రత కోసం పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు. మహిళలు విద్య, ఉపాధి మరియు నాయకత్వ రంగాల్లో ముందుకు రావాలని కోరారు.
ఎస్.ఐ. ప్రసాద్ మాట్లాడుతూ మహిళల భద్రత కోసం పోలీస్ శాఖ అందిస్తున్న సేవలను వివరించారు. మహిళలు ఏదైనా వేధింపులు లేదా సమస్యలు ఎదుర్కొన్నప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, ప్రభుత్వం అందిస్తున్న హెల్ప్‌లైన్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి తమ హక్కులను కాపాడుకోవాలని ఆయన కోరారు..
ఈ సందర్భంగా నిర్వహించిన వక్తృత్వ మరియు వ్యాసరచన పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని మహిళా సాధికారత, సమాజంలో మహిళల పాత్ర, మహిళల హక్కులు వంటి అంశాలపై తమ అభిప్రాయాలను వ్యక్తంచేసారు. పోటీలో ఉత్తమంగా ఎంపికైన విద్యార్థులకు బహుమతులు అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ శ్రీ.టి.కృష్ణ, ఐ క్యు ఏసి కోఆర్డినేటర్ శ్రీ కె భద్రాచలం, ఎకడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ వి యామిని,తెలుగు విభాగాధిపతి డా. భూసి వెంకటస్వామి, మహిళా సాధికారత విభాగం కన్వీనర్ శ్రీమతి బి.కె.వి. రామలక్ష్మి, ఎన్ఎస్ఎస్ యూనిట్ వన్ ప్రోగ్రాం ఆఫీసర్ డా.వి.డి. వి.విజయ లక్ష్మి, మహిళా సాధికారత విభాగం సభ్యులు కే స్వర్ణలత,పి జోష్ణ శ్రీ,డి హెప్సిరాణి, వి శిరీష, ఎం శిరీష, పి దుర్గేశ్వరి, ఇతర అధ్యాపక సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు, ఏఎస్ఐ మార్లింగం,మహిళా పోలీసులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఏ ఎస్ ఎన్ ఎం కాలేజీలో మహిళా దినోత్సవం.
జాతీయ మహిళా దినోత్సవ సభలో మాట్లాడుతున్న ప్రిన్సిపల్