Telugu News Power

నర్సాపురానికి వందే భారత్ వరం

నరసాపురం పార్లమెంట్ సభ్యులు,కేంద్ర ఉక్కు ,భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రివర్యులు భూపతి రాజు శ్రీనివాస్ వర్మ శుక్రవారం ముఖ్యమైన ప్రకటన చేశారు. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి నరసాపురానికి వందే భారత రైలు రాబోతున్నట్టు వెల్లడించారు. దీంతో స్థానిక నాయకులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో నరసాపురం – తిరుపతి, మచిలీపట్నం – బీదర్ తదిత రైళ్ళు అప్పటి మచిలీపట్నం ఎంపీ బాడిగ రామకృష్ణ వల్ల వచ్చాయి. ఆ తరువాత అమరావతి, అరుణాచలం రైళ్ళు వచ్చాయి. వందేభారత రైలు గతం నుంచి విజయవాడ వరకు నడుస్తుంది. ఇక్కడ నిలిపి ఉంచడం వల్ల ప్లాట్ఫారం ఖాళీ లేక ఇబ్బందులు ఎదురయ్యేవి. రైల్వే శాఖ ఈ రైలు నరసాపురం వరకు పొడిగించడం వల్ల ఈ ఇబ్బందిని అధిగమించవచ్చని ఆలోచన చేసింది. అయితే అమల్లోకి రాలేదు. కేంద్రమంత్రి వర్మ చొరవతో ఈ ప్రాజెక్టుకు చైతన్యం వచ్చింది. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో కొన్నిసార్లు చర్చించి ఒప్పించారు. చెన్నై సెంట్రల్ నుంచి నరసాపురం వరకు వచ్చే ఈ రైలు నెంబరు 20677/ 20678. ఉదయం 5:30 గంటలకు చెన్నై ఎంజీఆర్ సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి అదే రోజు మధ్యాహ్నం రెండు గంటల 10 నిమిషాలకు నరసాపురం చేరుకుంటుంది. మళ్ళీ మధ్యాహ్నం 2గంటల 50 నిమిషాలకు నరసాపురం లో బయలుదేరి రాత్రి 11గంటల 45నిమిషాలకు చెన్నై సెంట్రల్ చేరుతుంది. ఈనెల 6న రైల్వే శాఖ విడుదల చేసిన ప్రకటనలో ఎప్పటినుంచి ఈ రైలు నరసాపురం వరకు పొడిగిస్తారనేది, వారిచ్చిన ప్రకటనలో ఎక్కడ లేదు. సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలుస్తుంది. పాలకొల్లు వ్యాపార, వాణిజ్య, ఆధ్యాత్మిక రంగాలకు సంబంధించిన ప్రముఖ పట్టణం. కోనసీమ జిల్లాకు వెళ్లేందుకు ఇక్కడి నుంచి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో చించినాడ వంతెనకు వెళ్ళే బైపాస్ రోడ్డు ఉంది. గల్ఫ్ దేశాలకు వెళ్లేవారూ ఎక్కువ. పాలకొల్లు ఆచంట వాటి చుట్టుపక్కల చాలా గ్రామాల ప్రజలు పాలకొల్లు కేంద్రంగా రాకపోకలు సాగిస్తారు. ఇంత ప్రాధాన్యత ఉన్న పాలకొల్లు రైల్వే స్టేషన్ లో వందే భారత్ రైలు ఆగుతుందని కూడా ఆ ప్రకటనలో ఎక్కడ పేర్కొనలేదు. మరో విషయం, ముఖ్యమైనది, అందరికీ కావలసిన సీట్లు,బెర్త్ ల సంగతి , రైల్వే శాఖ ఈ విషయంలో ఎక్కడా పట్టించుకున్నట్టు లేదు. నరసాపురం వరకు రైలు సర్వీస్ అయితే పొడిగించారు గాని ,కోచ్ కాంపొజిషన్లో మార్పులు ఏమి లేవని ప్రకటించారు. ఒక్క భోగి అయినా పెంచుతారా లేక అవే కోచ్ లతో లాగించేస్తూ, అందర్నీఅందులోనే పోటీ పడమంటారో తేలవలసి ఉంది. గత ఐదేళ్లలో నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధి ఒక్క అంగుళం కూడా ముందుకు కదలలేదు. ఇప్పుడు శ్రీనివాస్ వర్మ ఎంపీ కావడం, అందులోనూ మంత్రి కావడం వల్ల అభివృద్ధి ఇక పట్టాలు ఎక్కవ వచ్చునని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.