పాలకొల్లు:డిసెంబర్,16 (తెలుగు న్యూస్ పవర్) రాజ్యాంగం లోని ఆర్టికల్ 14 అనుసరించి,1982 డిసెంబర్ 17న గౌరవనీయ భారత సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును పురస్కరించుకొని ప్రతి ఏటా పింఛనుదారుల ఈ దినోత్సవం జరుపుకుంటారు. ఇందుకు, డి ఎస్ నకార చేసిన పోరాట ఫలితంగా పెన్షనర్స్ కు హక్కులు లభించాయి. జస్టిస్ వై వి చంద్రచూడ్ తన తీర్పులో, పెన్షన్ అనేది విశ్రాంత ఉద్యోగికి పెట్టే బిక్ష కాదని, అది వారు ఉద్యోగంలో ఉన్నప్పుడు చేసిన, విధిగా చెల్లించవలసి ఉన్న నిధిగా చూడాలని పేర్కొన్నారు. వీరిరువురిని పెన్షనర్ లు తమ పాలిటి దైవాలుగా భావిస్తారు. ప్రపంచంలో పింఛను పద్ధతి అమలులోకి రావడానికి అధ్యుడు జర్మనీ ఛాన్సలర్ బిస్మార్క్. ఆనాటి వలస పాలకులు కూడా పెన్షన్ విధానాన్ని అనుసరించారు. భారతదేశంలో పింఛను విధానానికి 160 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. ప్రస్తుతం అమలవుతున్న సిపిఎస్ విధానం వల్ల ఉద్యోగుల మలిసంధ్య లో ఎదురయ్యే కష్టాల పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో వివిధ మార్గాలలో తప్పించుకోవడానికి పధక రచన చేస్తున్నాయి. గతంలో, వారం రోజుల్లో సిపిఎస్ విధానం రద్దు చేస్తానన్న వైయస్సార్ పార్టీ, ప్రభుత్వంగాని,ప్రస్తుత కూటమి ప్రభుత్వంగాని సమస్యకు పరిష్కారం చూపలేకపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెన్షన్ విధానాలకు వ్యతిరేకంగా, కోర్టు తీర్పులు సైతం ధిక్కరించి, సంబంధం లేని ఆర్థిక బిల్లులో ఈ అంశాన్ని చేర్చి ఉద్యోగులను ఏమార్చాలని చూస్తున్నదని, ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలకు చెలగాటం, పెన్షనర్లకు ప్రాణ సంకటంగా మారింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిపాదించిన కార్మిక బిల్లులో మరింత ఘోరమైన పరిస్థితులు కల్పిస్తున్నట్టు తెలుస్తుంది. రాబోయే కాలంలో శాశ్వత ఉద్యోగాలంటూ ఏమీ ఉండని విధంగా ఆ బిల్లులు ఉన్నాయని చెబుతున్నారు. కేవలం 12 ఏళ్లకు మాత్రమే ఉద్యోగాలు, అవి కూడా ఏ విధమైన ఉద్యోగభద్రత లేకుండా ఉంటాయని బిల్లులో ప్రతిపాదించినట్టు వార్తలు వస్తున్నాయి. పెన్షనర్ల దినోత్సవం సందర్భంగా అందరూ ఐకమత్యంతో ఈ విపత్తును ఎదుర్కోవడానికి సంసిద్ధులు కావాలని, నేడు జరగబోయే కార్యక్రమాల్లో ఆ మేరకు నిర్ణయాలు ఉంటాయని నాయకులు చెబుతున్నారు.
నేడే నేషనల్ పెన్షనర్స్ డే