Telugu News Power

బూట్ క్యాంపుకు ఏ ఎస్ ఎన్ ఎం విద్యార్థుల ఎంపిక.

పాలకొల్లు: ఫిబ్రవరి, 25(తెలుగు న్యూస్ పవర్)
రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్టీఐహెచ్), కమిషనరేట్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ (సీసీఈ) ఆధ్వర్యంలో ‘పీఎం-యూఎస్ హెచ్ఎ’ కార్యక్రమంలో భాగంగా అమరావతిలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లో ఈ నెల 22 నుంచి 5 రోజుల బూట్ క్యాంప్ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ డిగ్రీ కళాశాలల నుండి ప్రతిభ ఆధారంగా 60 మంది విద్యార్థులను ఈ శిబిరానికి ఎంపిక చేశారు. స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాల, నుంచి 11 మంది విద్యార్థులు బూట్ క్యాంప్‌లో పాల్గొనడానికి ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి రాజరాజేశ్వరి తెలిపారు.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రూసా రాష్ట్ర ప్రాజెక్టు అధికారి, ఐఏఎస్ డాక్టర్ నారాయణ గుప్తా మాట్లాడుతూ, విద్యార్థుల్లో ఆలోచనా సామర్థ్యాన్ని పెంపొందించడంతో పాటు సమాజంలో ఎదురయ్యే సవాళ్లకు అర్థవంతమైన పరిష్కారాలను కనుగొని, వాటిని ఆచరణీయ వ్యాపారాలుగా మలచే దిశగా ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు. విద్యార్థులు సృజనాత్మక మరియు దీర్ఘకాలిక సమస్య పరిష్కారాలపై దృష్టి సారించాలని ఆయన పిలుపునిచ్చారు.
మొదటి రోజు స్టార్టప్ మరియు వ్యాపారం మధ్య తేడాలను అవగాహన చేసుకున్నారు. స్టార్టప్‌ల లక్షణాలు, వృద్ధి అవకాశాలు, రిస్క్ అంశాలపై వారికి మార్గదర్శనం అందించారు.
రెండవ రోజు డిజైన్ థింకింగ్, కన్వర్జెంట్ మరియు డైవర్జెంట్ ఆలోచనా విధానాలపై శిక్షణ ఇచ్చి, సృజనాత్మకంగా సమస్యలను విశ్లేషించే పద్ధతులను పరిచయం చేశారు.
మూడవ రోజు బ్రెయిన్‌స్టార్మింగ్, రివర్స్ బ్రెయిన్‌స్టార్మింగ్ పద్ధతులతో పాటు స్టార్టప్ ప్రొడక్ట్ అభివృద్ధి ముఖ్య దశలను వివరించారు.
ఈ బూట్ క్యాంప్‌లో 11 మంది విద్యార్థులు పాల్గొనడం ద్వారా వారి వ్యాపార నైపుణ్యాలు మరింతగా అభివృద్ధి చెందుతాయని కళాశాల ప్రిన్సిపల్ పేర్కొనారు.