Telugu News Power

భక్తుల సేవే, భగవంతుని సేవ. – జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

పూర్ణకుంభంతో కలెక్టర్ కుస్వాగతం
క్షీరారామలింగేశ్వర స్వామిని దర్శించుకుంటున్న కలెక్టర్ నాగరాణి

పాలకొల్లు: ఫిబ్రవరి,14(తెలుగు న్యూస్ పవర్) భక్తుల సేవే, భగవంతుని సేవగా భావించి అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు. శివరాత్రి ఏర్పాట్ల పరిశీలనకు, శనివారం, కలెక్టర్ స్థానిక క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయాన్ని సందర్శించారు. దేవస్థానం వారు పూర్ణకుమంతో, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయ ప్రధాన అర్చకులు, క్రిష్టప్ప, అనిల్ వేద ఆశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. రామయ్య ధర్మకర్తల మండలి,అధ్యక్షులు మీసాల రామచంద్రరావు, ఈవో ముచ్చర్ల శ్రీనివాసరావు, కలెక్టర్ కు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. కలెక్టర్ స్థానిక ఛాంబర్ లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. భక్తులను గౌరవించి, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వృద్ధులు, మహిళలు, దివ్యాంగులకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున , ట్రాఫిక్ నియంత్రణకు,రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలు తొలగించాలని పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భక్తుల భద్రతను పర్యవేక్షించాలన్నారు. దాతలు వితరణ చేసే అన్నప్రసాదాలు ఇబ్బందులు లేకుండా స్వీకరించడానికి తగు ఏర్పాట్లు చేయాలన్నారు. ఆలయ ప్రాంగణంలో, పరిసరాలలో త్రాగునీటి సదుపాయం, వైద్య సేవలు, పరిశుభ్రత, అగ్నిమాపక దళం నిరంతరం అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. రాత్రివేళ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయటానికి జనరేటర్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సంబంధిత అధికారులు, అప్రమత్తంగా ఉండి, సమర్థవంతంగా తమ విధులు నిర్వర్తిస్తూ, భక్తులు శాంతియుత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో మహాశివరాత్రి పర్వదినాన్ని, ఆధ్యాత్మిక అనుభూతితో జరుపుకునేలా కృషి చేయాలని కోరారు.ఆలయానికి సుదూర ప్రాంతం నుంచే ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా పరిసరాలను తీర్చిదిద్దాలని కోరారు. ఈ పర్యటనలో, ఆర్డీవో, దాసిరాజు, డి.ఎస్.పి శ్రీ వేద, దేవాదాయ శాఖ, అసిస్టెంట్ కమిషనర్, హరి సూర్య ప్రకాష్, తహసిల్దార్, యడ్ల దుర్గా కిషోర్, మున్సిపల్ కమిషనర్, విజయ సారథి, ఈవో ముచ్చర్ల శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్ర రావు, ధర్మకర్తలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
స్థానిక శివదేవుని చిక్కాల శివదేవస్వామి ఆలయం అంతకుముందు కలెక్టర్ సందర్శించారు. ఆలయంలో పూజలు చేసి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. శివరాత్రి ఏర్పాట్లు స్వయంగా పరిశీలించారు. భక్తులకు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

స్వామి వారి చిత్రపటాన్ని స్వీకరిస్తున్న కలెక్టర్
అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్
అధికారులకు సూచనలు ఇస్తున్న కలెక్టర్