పాలకొల్లు: జనవరి,30(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఎడ్ల బజారు సెంటర్లో వేంచేసి పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయ ప్రధాన అర్చకులు రమణ గురుస్వామి, సోదరులు రఘు గురుస్వామి శుక్రవారం ఆకస్మికంగా మృతి చెందారు. వీరి మరణం పాలకొల్లును విషాదంలో నింపింది. గురుదేవులు, ఎస్టిపివి ఆచార్యుల కుమారులు వీరు. ఎందరికో ఆత్మీయ బంధువు. భక్త జనుల కోసం ఎంతగానో తరితిపించిన నిస్వార్థ దైవ భక్తులు. స్థానిక గజలక్ష్మి ప్రాంతంలో అప్పటికప్పుడు, ఏర్పాట్లు చేసి, అయ్యప్ప స్వామి వారి భజన కార్యక్రమం ఏర్పాటు చేసిన పట్టుదలగల భక్తుడు రఘుబాబు. అందరిని ఆప్యాయంగా పలకరించి,సహకరించే సహృదయుడు రఘుబాబు. ముక్కుసూటి మనిషి గా పేరు తెచ్చుకున్నారు. భక్తులకు వీరంటే ఆత్మీయ అభిమానం. వీరికి రాజకీయ నేపథ్యం ఉంది. బిజెపి పార్టీ కోసం తన విలువైన జీవితాన్ని అర్పించారు. నిరంతరం స్కూటర్పై తిరుగుతూ, జిల్లా వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కృషి చేశారు. బిజెపి మొదటి శ్రేణి నాయకులతో వీరికి సన్నీహిత సత్సంబంధాలు ఉండేవి. మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు తో అర్ధరాత్రి అయినా ఫోన్లో మాట్లాడేటంత చనువు వీరికి ఉంది. ఆ తర్వాత, ఏవో కారణాలవల్ల పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. మున్సిపల్ వార్డు ఎన్నికల్లో, పోటీ చేసి ప్రత్యర్థికి గట్టి పోటీ ఇచ్చారు. వీరి మృతి వార్త పట్టణ ప్రజలు నమ్మలేకపోయారు. స్థానిక సూర్య తేజస్ నగర్లోగల గృహం వద్ద పలువురు వారికి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు, ఈ విషాద సమయంలో భగవంతుడు తోడుగా ఉండాలని, ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. బిజెపి నాయకులు కొల్లికొండ ప్రసాద్, ఉన్నమట్ల కపర్తి, జక్కంపూడి కుమార్, సిరిగినీడి రామారావు, చింతపల్లి రమేష్ శెట్టి తదితర పలువురు పట్టణ ప్రముఖులు రఘు బాబుకు నివాళులర్పించారు.
