పాలకొల్లు, డిసెంబర్,25(తెలుగు న్యూస్ పవర్) రాష్ట్రానికి సామంత రాజు అయిన, పొలానికి రైతునేనని నిరూపించారు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు. విశ్రాంతి అంటే, పని నుంచి పనికి అనే పెద్దల మాట, మంత్రి విషయంలో చక్కగా సరిపోతుంది. రాష్ట్రస్థాయిలో పనిమంతుడు పదానికి చిరునామాగా నిలిచారు నిమ్మల. బుడమేరు వరదల సమయంలో వీరి పనితనాన్ని రాష్ట్రం మొత్తం గుర్తించి అభినందించింది. రాష్ట్రానికి అత్యంత ముఖ్యమైన నీటిపారుదల శాఖమాత్యులుగా క్షణం తీరిక లేకుండా ఉన్న, దుబాయ్ లో ఉన్న, సెలవు వచ్చిందంటే మాత్రం తన సొంత నియోజకవర్గ పాలకొల్లుకు రెక్కలు కట్టుకొచ్చి మరీ వాలిపోతారు. ఆ రెండు రోజులు రాజు వెడలే అన్నట్టుగా సుడిగాలి పర్యటలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. ఆ వెనకే పార్టీ నాయకులు, మంది మార్బలం, అధికారులు పరుగులు పెట్టవలసిందే. క్రిస్మస్ సందర్భంగా గురువారం, తన మూలాలను గుర్తు చేసుకుని, తన స్వగ్రామం ఆగర్తిపాలెం వెళ్లి, రైతుబిడ్డగా, నేలతల్లిని స్పృశించి, మట్టి వాసనలు ఆస్వాదించి సేద తీరారు. పోలంపనిలో కష్టమైన గట్టు లంకలు వేశారు. పవర్ టిల్లర్ తో దమ్ము చేశారు. దిగిపోయిన ట్రాక్టర్ను కార్మికులతో కలిసి సాయం పట్టి, మళ్ళీ పనిలో పెట్టారు. తనకు విరామం దొరికినప్పుడల్లా వ్యవసాయ పనుల్లో నిమగ్నం అవటం వల్ల తనకు సంతోషం, సంతృప్తి కలుగుతాయన్నారు. వ్యవసాయ పనుల్లో అన్నదాతకు సంఘీభావంగా ఉండి, వారి కష్టనష్టాలు తెలుసుకోవడం అవసరం అన్నారు. తన తండ్రి నాటి నుంచి ఈ అలవాటు తనకు ఉందని, సోషల్ మీడియాలో తన అనుభవాలను, ఆనందాన్ని పంచుకున్నారు.