యమంచిలి:డిసెంబర్,16 (తెలుగు న్యూస్ పవర్) ఈ ఏడాది ప్రతికూల వాతావరణ పరిస్థితులు వల్ల సార్వపంట దారుణంగా దెబ్బతింది. రైతులకు తీవ్ర నష్టం మిగిల్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా దిగుబడి దారుణంగా తగ్గిపోయింది.
క్రాప్ కటింగ్ శాంపుల్స్ లో ఎకరానికి 14 నుంచి 22 బస్తాల దిగుబడి నమోదయింది. వాస్తవానికి ఎక్కడ 20 బస్తాల దిగుబడి వచ్చిన రైతులు లేనే లేరని వారే చెబుతున్నారు. గింజ పాలు పోసుకునే కీలక సమయంలో అకాల వర్షాలు గింజ తాలుగా మారిపోవడానికి కారణమైందని రైతులు చెబుతున్నారు. ముందుగా
ఊడ్చిన పొలాలు పంట తయారైనా, తుఫాను వల్ల నేలకొరిగి దిగుబడి పడిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కోత సమయంలో పంటకు మానిపండు చీడ వల్ల పంట నాణ్యత తగ్గిపోయిందని రైతులు వాపోతున్నారు.ఎకరానికి కనీసం 10 వేల రూపాయల వరకు నష్టం వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కౌలు రైతులకు ఈ నష్టం, దాళ్వా పంట వేసుకోవడానికి కష్టాలు తెచ్చిపెడుతుందని, అందువల్ల కౌవులు తీసుకోవడం వాయిదా వేసినట్టు చించినాడకు చెందిన కటారి నాగభూషణం అనే రైతు తెలిపారు. ప్రభుత్వం వ్యవసాయంలో ప్రవేశపెట్టిన యాంత్రికీకరణ వల్ల ఈ నష్టం కొంతమేర తగ్గిందని రైతుల అభిప్రాయపడుతున్నారు. ఒక్క కోత సమయంలోనే మనుషులు కాకుండా యంత్రాలతో మాసూలు చేయించడం వల్ల ఆ ఖర్చు 15- 16 వేల నుంచి 7- 8 వేల రూపాయల వరకు తగ్గుతుందని తెలిపారు. యంత్రాలు లేకపోతే ఈ పరిస్థితుల్లో కోత కోయడం కూడా కష్టమయ్యేది అన్నారు. ప్రభుత్వం కొనుగోలు చేసే ధాన్యం తేమశాతం 17 వరకు గరిష్టంగా ఉండవచ్చునని నిబంధన పెట్టారు. ఇందుకుగాను కనీసం మూడు రోజులు పంట ఆరబెట్టవలసి వస్తుందని రైతులు చెబుతున్నారు. బరకాలకు రోజుకు 300 రూపాయలు, మనిషికి ఎనిమిది వందల రూపాయల వరకు రోజుకు ఖర్చు పెట్టవలసి వస్తుందని,ఇది రైతుకు అదనపు ఖర్చుని తెలిపారు. ప్రస్తుతం బస్తా 1740 రూపాయలకు కొంటున్నారు. మిల్లుకు తరలించడం తదితర ఖర్చులు వంద రూపాయలు వరకు ఉంటుందని యలమంచిలికి చెందిన తమ్మినీడి కృష్ణ అనే రైతు తెలిపారు. తేమ శాతం బట్టి ఈ రేటు మారుతుంది. కొందరు రైతులు ఆరబెట్టడం ప్రక్రియ ఇబ్బందులు పడలేక, నేరుగా పంటను మిల్లులకు తరలిస్తున్నామని చెబుతున్నారు. ఇందువల్ల రేటు కొంత తగ్గుతుందని తెలిపారు. మిల్లుకు 18 వేల మెట్రిక్ టన్నుల లక్ష్యం ఉన్న, గతవారం శుక్రవారం నాటికి 4 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే మిల్లుకు చేరినట్టు రైస్ మిల్ వర్గాలు తెలిపాయి. రైతుల తెచ్చే ధాన్యం తేమ శాతం 14 నుంచి 20 వరకు ఉంటుందని వెల్లడించారు. ధాన్యం అమ్మిన కొన్ని గంటల్లోనే ప్రభుత్వం డబ్బు చెల్లిస్తున్నదని, ఇది రైతు మాసూలు ఖర్చులు వెంటనే చెల్లించుకోవడానికి సహాయపడుతుందన్నారు. పంట పైకి కనపడినంత గా ఈసారి దిగుబడి రాలేదని, ఇందువల్ల సార్వా పంటకు అవసరమైన ఇన్పుట్స్ సబ్సిడీ కల్పించి ఆదుకోవాలని ప్రభుత్వానికి రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. లేదంటే ఈ ప్రభావం వల్ల వ్యవసాయం పట్ల కౌవులు రైతులు విముఖత చూపటం, క్రాప్ హాలిడే వంటి ప్రమాదకర పరిస్థితులు ఎదురవుతాయని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రైతుకు తీరని కష్టం,సార్వ పంట నష్టం.
మిల్లుకు తరలివచ్చిన పంట