Telugu News Power

వజ్ర సంకల్పం ముందు వైకల్యం ఓటమి

వేదాంతం సదాశివమూర్తి

పాలకొల్లు:డిసెంబర్,3 (తెలుగు న్యూస్ పవర్)
వైకల్యాన్ని ఎదిరించి నిలిచిన నిలువెత్తు స్ఫూర్తి
వేదాంతం సదాశివమూర్తి. యలమంచిలి మండలం అబ్బిరాజుపాలానికి చెందిన, ప్రస్తుతం పాలకొల్లులో స్థిరపడ్డ వీరి జీవితం దివ్యాంగులకు ఓ ఆచరణీయ మార్గదర్శి. రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ప్రమాదంలో రెండు కాళ్లు మోకాలు వరకు తొలగించవలసి వచ్చింది. తీవ్రమైన శారీరిక బాధను మానసిక వేదనను తట్టుకుని నిలబడిన మేరు పర్వతం సదాశివమూర్తి. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ పట్టా పొంది, ద్విచక్ర వాహనాలు, ముఖ్యంగా బుల్లెట్ వాహనాలను ఎంత మొండికేసినా దారిలో పెట్టడం వీరి హాబి. వికలాంగుల కోసం చేతులు,కాళ్లు తయారుచేసి అందించటంలో మీరు అందవేసిన చెయ్యి. ఇటీవల మనుషులకేకాకుండా, ఆవుకు కూడా కాలు అమర్చి, దివ్యాంగుల పట్ల దైవత్వాన్ని చూపారు. వీరి సేవ భావానికి,వజ్ర సంకల్పానికి అందుకోని అవార్డు లేదు. ఎప్పుడూ ,ఎక్కడో చోట, ఎవరో ఒకరు అవార్డులతో సత్కరిస్తూనే ఉంటారు.వీరు బుల్లెట్ బండి పై వెళుతుంటే దివ్యాంగులనే ఆలోచన కూడా ఎవరికీ రాదు. ధైర్యంలో వీరు ఆరడుగుల బుల్లెట్. జీవితంలో కూడా అలాగే దూసుకుపోతూ, అందరికీ ఆదర్శప్రాయుడు అవుతున్నారు. దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఇంకా ఉన్నత శిఖరాల అధిరోహించాలని, వారికి శుభాకాంక్షలు తెలియజేద్దాం.