
పాలకొల్లు: జనవరి,14(తెలుగు న్యూస్ పవర్) సంక్రాంతి ఉత్సవాలు, గత 11 ఏళ్లుగా, నిర్విరామంగా, ఇంత భారిస్థాయిలో నిర్వహించడం అనితర సాధ్యమని, కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, స్థానిక శాసనసభ్యులు, మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు కృషిని అభినందించారు. యువతలో సాంప్రదాయ క్రీడల పట్ల అభిరుచి కలిగించడానికి ఈ సంక్రాంతి క్రీడలు స్ఫూర్తినిస్తాయన్నారు. గత వారం రోజులుగా, కలిదిండి రామరాజు (ఆడిటర్ రామరాజు) క్రీడా ప్రాంగణంలో ధర్మారావు ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో, నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాలు బుధవారం రాత్రి ముగిశాయి. నియోజకవర్గంలోని రోడ్లన్నీ, స్థానిక బి ఆర్ ఎం వి హై స్కూల్, సంక్రాంతి సంబరాలవైపు దారితీసాయి. ప్రజలు,కుటుంబ సమేతంగా ఉత్సవాలను తిలకించి ఆనందించారు. భోగి పండుగ సందర్భంగా బుధవారం ఉదయం మంత్రి నిమ్మల రామానాయుడు, ఓటమి నాయకులతో కలిసి భోగిమంటతో సంబరాలు ప్రారంభించారు. అంబరాన్ని అంటిన ఈ సంబరాలు అర్ధరాత్రి వరకు అలుపు సొలుపు లేకుండా ఉత్సాహంగా ఉల్లాసంగా సాగాయి. సినీ నేపథ్య గాయని సునీత,ధ్వని అనుకరణ కళాకారుడు శివారెడ్డి ఆహుతులను తమ ప్రతిభ ప్రదర్శనతో ఉర్రూతలూగించారు. సంక్రాంతి శోభ ఉట్టిపడేలా ఏర్పాటు చేసిన వాతావరణం, అతిధులను ఎంతగానో ఆకర్షించింది. కేంద్ర మంత్రివర్యులు వర్మ క్రీడాకారులకు బహుమతి ప్రధానం చేశారు. ముగ్గుల పోటీలో నియోజకవర్గ స్థాయికి చేరిన విజేతలకు కూటమి నాయకులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో, సినీ గేయ రచయిత, చేగొండి అనంత శ్రీరామ్, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, కూటమి నాయకులు బోనం చినబాబు, ఉన్నమట్ల కపర్థి, తులా రామలింగేశ్వర, ఎర్రంశెట్టి పద్మారావు, ఏఎంసీ చైర్మన్, కోడి విజయభాస్కర్, కర్నేని రోజా రమణి గౌర్నాయుడు దంపతులు,టిడిపి రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి బాబు, పట్టణ అధ్యక్షులు గండేటి వెంకటేశ్వరరావు, గొట్టుముక్కల సూర్యనారాయణ రాజు తదితర పలువురు నాయకులు పాల్గొన్నారు.
