Telugu News Power

సురక్షిత ప్రాంతాలకు భారతీయులు. -టెహరాన్ ఇండియన్ ఎంబసీ

ఇండియన్ ఎంబసీ సూచనలు పాటించి సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని విజ్ఞప్తి చేసిన విదేశాంగ మంత్రి జయశంకర్

టెహరాన్: మార్చి, 4(తెలుగు న్యూస్ పవర్. కాం)
తెహ్రాన్‌లో ఉద్రిక్తతల వల్ల భారత విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు భారత రాయబార కార్యాలయం బుధవారం తెలిపింది.
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో టెహరాన్ లో ఉన్న ఇండియన్ ఎంబసీ కీలక ప్రకటన విడుదల చేసింది. టెహ్రాన్ నగరంలో భద్రతా పరిస్థితులపై పెరిగిన ఆందోళనల కారణంగా అక్కడ ఉన్న భారతీయ విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించింది.
రాయబార కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం, టెహ్రాన్‌లో ఉన్న ఎక్కువమంది భారతీయ విద్యార్థులను నగరానికి వెలుపల ఉన్న సురక్షిత ప్రాంతాలకు మార్చారు. వారి ప్రయాణం, ఆహారం, వసతి వంటి అన్ని ఏర్పాట్లు రాయబార కార్యాలయమే చేపట్టింది. విద్యార్థుల భద్రతే ప్రధాన లక్ష్యమని అధికారులు స్పష్టం చేశారు.
అయితే, రాయబార కార్యాలయం ఇచ్చిన ఆఫర్‌ను స్వీకరించని కొంతమంది విద్యార్థులు మాత్రం ఇంకా టెహ్రాన్‌లోనే ఉన్నట్లు సమాచారం. వారికి అవసరమైన సూచనలు, సహాయం అందించేందుకు ఎంబసీ సిద్ధంగా ఉందని తెలిపింది.
ఇక ఇరాన్‌లోని ఇతర ప్రాంతాల్లో ఉన్న భారతీయ విద్యార్థులు, భారతీయులు ముందు జారీ చేసిన సూచనలను ఖచ్చితంగా పాటించాలని రాయబార కార్యాలయం మరోసారి సూచించింది. భద్రతా పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలని, అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మాలని విజ్ఞప్తి చేసింది.
మధ్యప్రాచ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం తన పౌరుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఈ చర్యల ద్వారా భారతీయుల్లో ధైర్యం నింపటానికి,రక్షించడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నట్టు స్పష్టమవుతోంది.