Telugu News Power

అంబటి అనుచిత వ్యాఖ్యలపై నిప్పులు చెరిగిన మంత్రి నిమ్మల.

కాజా పడమర సభలో మాట్లాడుతున్న మంత్రి నిమ్మల .

యలమంచిలి: జనవరి, 31(తెలుగు న్యూస్ పవర్) మాజీ మంత్రి, వైఎస్ఆర్ పార్టీ నాయకులు అంబటి రాంబాబు సభ్య సమాజంలో నిలబడే అర్హత కూడా లేదని, స్థానిక ఎమ్మెల్యే,రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు నిప్పులు చెరిగారు. స్థానిక కాజ పడమర గ్రామంలో సుమారు 50 లక్షల వ్యయంతో దిగమర్రు వరకు వేయనున్న రోడ్డు పనులకు మంత్రి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై సభ్య సమాజం తలదించుకునే విధంగా అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని నోటితో ఉచ్చరించలేని బూతులు మాట్లాడడమే కాక, వారి తల్లిదండ్రులను కూడా దూషించడం గర్హనీయమన్నారు. మంత్రిగా పనిచేసిన, అంబటి రాంబాబు వ్యాఖ్యలు ప్రసారమాధ్యమాల్లో ప్రసారం చేయటానికి కూడా అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. అంబటి రాంబాబు అనగానే గుర్తొచ్చేవి, డాన్సులు, తదితర అంశాలను మంత్రి గుర్తుచేసి, ఎద్దేవా చేశారు. పదవిలో లేకపోయినా వైఎస్ఆర్సిపి నాయకుల తీరు మారలేదని విమర్శించారు. అంబటి మాటలను అధినాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి భేషరతుగా క్షమాపణలు చెప్పి, అంబటిచేత కూడా చెప్పించాలని డిమాండ్ చేశారు. లేదంటే, ఈ వ్యాఖ్యలు జగన్ సూచన మేరకే చేశారని భావించవలసి వస్తుందన్నారు. సభలో ఉన్న మహిళలకు, ఈ పరిణామాల పట్ల మంత్రి తన ఆందోళన వివరించారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు మామిడి శెట్టి పెద్దిరాజు, జిల్లా టిడిపి అధికార ప్రతినిధి నీటి సంఘం అధ్యక్షులు మాజీ సర్పంచ్ మాతారత్నం రాజు, నీటి సంఘం అధ్యక్షులు ఆరమిల్లి రామ శ్రీనివాస్, సొసైటీ అధ్యక్షులు బొప్పన హరికిషోర్, సర్పంచులు ఛాంబర్ మాజీ అధ్యక్షులు కడలి గోపి, ఎంపీటీసీ డేగల సూర్య కుమారి, పంజా నరసింహారావు, చిలుకూరు శ్రీనివాస్, డేగల వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.