
కార్తీక వన సమారాధన కార్యక్రమం ఆదివారం పాలకొల్లు పట్టణాన్ని హోరెత్తించింది. కార్తీక మాసం ఆఖరి ఆదివారం కావడంతో వివిధ సంఘాలవారు ఒకేరోజు ఈ కార్యక్రమాన్ని జరపడంతో పట్టణం సందడిగా మారింది.ఎక్కడ చూసినా ఆయా సంఘాల సభ్యులు కుటుంబ సమేతంగా వనభోజనాలకు తరలి వెళ్లారు. అక్కడ నిర్వహించిన వివిధ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పిల్లలు వారికి ఏర్పాటు చేసిన ఆటల్లో కేరింతలు కొడుతూ ఆనంద పడ్డారు. కొన్నిచోట్ల శాస్త్రీయ నృత్య కార్యక్రమాలు జరిగాయి. ఆడవారికి హౌసీ లక్కీ డిప్ పోటీలు నిర్వహించి, బహుమతులు అందజేశారు. చాలా చోట్ల సంగీత,నృత్య కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పాలకొల్లు క్షత్రియ సేవ సంఘం వారి ఆధ్వర్యంలో క్షత్రియ వనసమారాధన స్థానిక క్షత్రియ పరిషత్ కళ్యాణ మండపం లో నిర్వహించారు.
పాలకొల్లు శ్రీకృష్ణదేవరాయ కాపు సేవ సంఘం ఆధ్వర్యంలో ఎస్ కన్వెన్షన్ నందు,ఎదురుగా ఉన్న స్థలంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. తూర్పు కాపు సమారాధన పాలకొల్లు సాయిబాబా గుడి రోడ్ లో గల అడబాల గార్డెన్స్ నందు సందడిగా జరిగింది. పాలకొల్లు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో వన భోజన కార్యక్రమం జరిగింది. తెలకుల సంఘం వారి వనభోజన కార్యక్రమం పూలపల్లిబైపాస్ రోడ్ లో గల అడబాల మినీ కళ్యాణ మండపం లో నిర్వహించారు. విశ్వబ్రాహ్మణ సంఘం వనభోజనాలుచిత్రాయ చెరువు గట్టు కమ్యూనిటీ హాల్ లో జరిగాయి. శాలివాహన కార్తీకవనసమారాధన సాయిబాబా గుడి రోడ్ లో జరిగింది. శ్రీకృష్ణ యాదవ సంఘం స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు అన్ని సంఘాల వారిని ఆత్మీయంగా తన సుడిగాలి పర్యటనలో కలుసుకున్నారు. కాపుల వనభోజనాలకు వంగవీటి రంగా కుమార్తె ఆశా కిరణ్ హాజరయ్యారు. ఆయా సంఘాల ప్రముఖులు సభ్యులతో పాలుపంచుకున్నారు.

