పాలకొల్లు: ఫిబ్రవరి, 13(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ (స్వయం ప్రతిపత్తి) కళాశాల, విద్యార్థులకు ఉపాధి నైపుణ్యాలు మరియు స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించడమే లక్ష్యంగా బాలికలకు నిర్వహించిన 5 రోజుల ఏరియల్ డ్రోన్ పైలట్ ట్రైనింగ్ కార్యక్రమం ఐదవ రోజు విజయవంతంగా ముగిసింది. ఈ శిక్షణ కార్యక్రమం ఎస్.కె.పి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్), గుంతకల్లు వారి ఆర్థిక సహకారంతో, పీఎం–ఉషా జి.ఐ.ఈ.ఐ స్కీంలో భాగంగా, ఏరీస్ ఆగ్రో లిమిటెడ్, ముంబై సహకారంతో, కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్లు మరియు మహిళా సాధికారతా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించారు.
శిక్షణ ముగింపు సందర్భంగా ఐదవ రోజు ఉదయం డ్రోన్ శిక్షణ పొందిన విద్యార్థినులకు వైవా వోస్ మరియు రాత పరీక్షలు జరిగాయి. డ్రోన్ భాగాలు, ఫ్లైట్ కంట్రోల్స్, జీపీఎస్ నావిగేషన్, ఫ్లైట్ ప్లానింగ్, భద్రతా నియమాలు, బ్యాటరీ మేనేజ్మెంట్, వ్యవసాయ స్ప్రేయింగ్ తదితర అంశాలపై వారి అవగాహనను పరీక్షించారు. విద్యార్థినులు విశ్వాసంతో పరీక్షలను పూర్తి చేసి తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు.
అనంతరం కళాశాల సెమినార్ హాల్లో ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి. రాజరాజేశ్వరి అధ్యక్షత వహించి మాట్లాడుతూ, డ్రోన్ టెక్నాలజీ వంటి ఆధునిక నైపుణ్యాలను బాలికలు నేర్చుకోవడం గర్వకారణమని, భవిష్యత్లో వ్యవసాయం, సర్వే, ఫోటోగ్రఫీ, విపత్తు నిర్వహణ వంటి రంగాలలో విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ శిక్షణ విద్యార్థినుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి స్టార్ట్-అప్ అవకాశాలకు దారి చూపుతుందని తెలిపారు.
ఏరీస్ ఆగ్రో లిమిటెడ్, ముంబై, కళాశాల రసాయన శాస్త్ర విభాగం మరియు మహిళా సాధికారతా విభాగం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించబడిన భూసార పరీక్షలపై రెండు రోజుల రోజు ల్యాబ్ శిక్షణ పొందిన విద్యార్థులకు ఈ రోజు పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణులు అయిన విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందచేసారు. ఈ శిక్షణ ద్వారా వ్యవసాయ రంగంలో శాస్త్రీయ పద్ధతులను అవలంబించే సామర్థ్యం పెంపొందుతుందని నిపుణులు తెలిపారు.
వైస్ ప్రిన్సిపల్ టి. కృష్ణ మాట్లాడుతూ, పీఎం–ఉషా పథకం ద్వారా ఇలాంటి నైపుణ్యాధారిత కోర్సులు నిర్వహించడం ద్వారా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కొత్త అవకాశాలు అందుతున్నాయని తెలిపారు.
తెలుగు విభాగాధిపతి డా. బి. వెంకట స్వామి విద్యార్థులు నేర్చుకున్న సాంకేతిక నైపుణ్యాలను సమాజ సేవలో ఉపయోగించాలని సూచించారు. డ్రోన్ ట్రైనర్ పి. దుర్గా ప్రసాద్ విద్యార్థుల ప్రతిభను అభినందించి, వారు భవిష్యత్లో సర్టిఫైడ్ డ్రోన్ పైలట్లుగా ఎదగాలని ఆకాంక్షించారు.
కార్యక్రమం చివరగా శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థినులకు సర్టిఫికెట్లు అందజేశారు. విద్యార్థినులు తమ అనుభవాలను పంచుకుంటూ కళాశాల యాజమాన్యానికి, ట్రైనర్లకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏరిస్ ఆగ్రో లిమిటెడ్ సిబ్బంది అశోక్ బాబు, వినయ్, ఐ క్యు ఎ సి కోఆర్డినేటర్ కె భద్రాచలం, ఎకడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ వి యామిని,ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు డా. ఎం. రామకృష్ణ, డా. వి.డి.వి. విజయలక్ష్మి, మహిళా సాధికారతా విభాగం కన్వీనర్ బి కే వి రామలక్ష్మి , రసాయన శాస్త్ర అధ్యాపకులు ఏవంసి సుబ్బరాయన్, ఎమ్ దివ్య,ఎన్ఎస్ఎస్ కమిటీ మెంబర్లు డి మన్మధరావు, పి జోస్న శ్రీ,ఇతర అధ్యాపకులు మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.