విజయవాడ/రామతీర్థం: మార్చి,25(తెలుగు న్యూస్ పవర్.కామ్) ఆలయాల అభివృద్ధికి, హిందూ ధర్మ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి పని చేస్తుందని, ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. ఆలయాల పవిత్రతను కాపాడటంతోపాటు దేశ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తామని హామీ ఇచ్చారు. విజయనగరం జిల్లా నెలిమర్ల నియోజకవర్గంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం గిరి ప్రదక్షిణ మార్గాన్ని బుధవారం వర్చువల్ గా పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా, ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ, సీతారాముని పేట కూడలి నుంచి నీలాచలం కొండ వరకు రూ.3.40 కోట్ల ఉపాధి హామీ నిధులతో 3.70 కిలోమీటర్ల మేర ఈ రహదారిని నిర్మించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, వంగలపూడి అనిత,
కొండపల్లి శ్రీనివాస్, పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, శాసనసభ్యులు లోకం మాధవి,
పూసపాటి అదితి విజయలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా, పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “భారతదేశంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో రామతీర్థం ఒకటని. ఈ క్షేత్రంలో రామాయణ, మహా భారత కాలం నాటి ఆనవాళ్లు ఉన్నాయని వెల్లడించారు. అంతటి పవిత్ర రామతీర్ధం కొండ చుట్టూ భక్తితో ప్రదక్షిణ చేస్తే ముక్తిని పొందుతారన్నది భక్తుల నమ్మకానికి తగినట్టుగా
వైకుంఠ ఏకాదశి, శివరాత్రి పర్వదినాల్లో బోదికొండగా పిలుచుకునే రామతీర్ధం గిరి చుట్టూ వేలాది మంది భక్తులు ప్రదక్షిణ చేసి మొక్కులు తీర్చుకుంటారని పేర్కొన్నారు.
రామతీర్థం గిరి ప్రదక్షిణ మార్గం గతంలో రాళ్లు, రప్పలు, ముళ్ల కంపలతో నిండి ఉండేదని, గిరిప్రదక్షిణకు వచ్చే భక్తులు కష్టమైనా, ఆ మార్గంలోనే నడిచేవారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఈ విషయాన్ని స్థానిక శాసన సభ్యురాలు లోకం మాధవి తోపాటు, కొందరు భక్తులు నా దృష్టికి తీసుకువచ్చారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఆలయాల పవిత్రతను సంరక్షించే చర్యల్లో భాగంగా రామతీర్ధం కొండ చుట్టూ రోడ్డు నిర్మించే బాధ్యతను భుజాన వేసుకున్నామన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల నుంచి రూ. 3.40 కోట్లు వెచ్చించి గిరిప్రదక్షిణ మార్గంలో బీటీ రోడ్డు నిర్మించామన్నారు. అధికారుల సహకారంతో శ్రీరామ నవమికి రెండు రోజుల ముందే రోడ్డును ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలయాల పవిత్రతను కాపాడే చర్యల్లో భాగంగా గడచిన 20 నెలల కాలంలో ఉపాధి హామీ పథకం, పంచాయతీరాజ్, సాస్కీ నిధులు రూ. 40 కోట్లకు పైగా వెచ్చించి రాష్ట్ర వ్యాప్తంగా 22 ప్రధాన ఆలయాలకు రోడ్డు సౌకర్యం కల్పించినట్టు వివరించారు. శివరాత్రికి ముందు శ్రీకాళహస్తి గిరిప్రదక్షిణ మార్గాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు.. కోటప్పకొండ గిరిప్రదక్షిణ మార్గంలో రోడ్డు మంజూరు చేసినట్టు వెల్లడించారు.. నేడు రాములవారి భక్తుల కోసం రామతీర్ధం గిరిప్రదక్షిణ రోడ్డుని అందుబాటులోకి వచ్చిందన్నారు.
గత ప్రభుత్వ పాలనలో రాముల వారి విగ్రహానికి శిరచ్ఛేదం వేదన కలిగించిందన్నారు.గత ప్రభుత్వం హయాంలో ఇదే రామతీర్ధం పుణ్యక్షేత్రంలో రాములవారి విగ్రహం శిరచ్ఛేదం చేస్తే కోట్లాది మంది హిందూ భక్తులు బాధతో వాపోయారన్నారు. వారిలో నేనూ ఒకడినని తెలిపారు. ఆ ఘటన తీవ్ర వేదన కలిగించిందన్నారు. ఈ రోజున ఆలయానికి గిరి ప్రదక్షిణ మార్గాన్ని సుందరంగా నిర్మించడం ద్వారా, స్వామిని ఈ రూపంలో సేవించుకునే భాగ్యం కలగడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. సంస్కృతి సంప్రదాయాలను కూటమి ప్రభుత్వం కాపాడుతుందని, కొనసాగిస్తుందని పేర్కొన్నారు.
దేవాలయాలకు 20 నెలల్లో 40 కోట్ల రూపాయలతో రోడ్డు సౌకర్యం కల్పించాం. -ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.
రామతీర్థం రోడ్డు వర్చువల్ గా ప్రారంభిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్