పాలకొల్లు; మార్చి,13(తెలుగు న్యూస్ పవర్. కామ్) వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వటం, రైతులను కాపాడుకోవడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.స్థానిక శివదేవుని చిక్కాల గ్రామంలో మూడో విడత పిఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకంలో రైతులకు పెట్టుబడి సాయం అందించే కార్యక్రమం శుక్రవారం రాత్రి జరిగిన సందర్భంగా, మంత్రి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం, సూపర్ సిక్స్ పథకంలో భాగంగా, ఆఖరి విడతగా రూ.2, 675ల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసినట్టు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతల్లో రూ.8, 989ల కోట్ల రూపాయలు రైతులకు జమ చేసిందన్నారు. ఇందువల్ల, రాష్ట్రంలో 46,85,838 మంది రైతులు పి యం కిసాన్, 6వేల రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం, అన్నదాత సుఖీభవ 14 వేల రూపాయలు, మొత్తం 20వేల రూపాయలు ప్రతి రైతు బ్యాంకు ఖాతాకు నేరుగా జమ అయిందన్నారు. స్థానిక నియోజకవర్గంలో 14,458 మంది రైతులకు, 8.91 కోట్ల రూపాయల రైతులకు చెల్లించారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రైతులను ఆదుకోవాలని ఉద్దేశంతో, నీటిపారుదలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. గత ప్రభుత్వం సాగునీరు,మురికి నీరు పంపిణీ వ్యవస్థల్ని విధ్వంసం చేసిందని విమర్శించారు. ఇందువల్ల వరదలకు పంట నష్టం, ఆస్తి నష్టం జరిగిందని ఆరోపించారు. అప్పటి జగన్ ప్రభుత్వం వారసత్వంగా, నీటిపారుదల శాఖకు 18 వేల కోట్ల రూపాయల బిల్లుల బకాయిల భారీ భారం పెట్టి వెళ్ళిందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ, బకాయిలు చెల్లించుకుంటూ, ఇరిగేషన్ వ్యవస్థను ముఖ్యమంత్రి గాడిలో పెడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకొల్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు కోడి విజయభాస్కర్, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, ఆర్డీవో దాసి రాజు, సహాయ వ్యవసాయ సంచాలకు పి మురళీకృష్ణ, టిడిపి మండల అధ్యక్షులు పాముల రజిని కుమార్, మామిడిశెట్టి పెద్దిరాజు, యర్రంశెట్టి పద్మారావు, ఉన్నమట్ల కపర్తి, భద్ర రాజు, డేగల సూర్య ప్రభ, సొసైటీ అధ్యక్షులు సత్తికొండ, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వ్యవసాయానికి ప్రాధాన్యం, రైతులను కాపాడుకోవడం -కూటమి ప్రభుత్వ లక్ష్యం, మంత్రి నిమ్మల
రైతులకు పెట్టుబడి సాయం చెక్కు అందజేస్తున్న మంత్రి నిమ్మల