పాలకొల్లు: మార్చి,8(తెలుగు న్యూస్ పవర్. కామ్) సామాజిక అవలక్షణాలపై మహిళలు పోరాడితేనే, వారికి సార్ధకత చేకూరుతుందని పిడిఎఫ్ ఎమ్మెల్సీ బుర్ర గోపి మూర్తి పేర్కొన్నారు. స్థానిక ఎంఎంకె ఉన్నత పాఠశాల,దాసరి నారాయణరావు కళావేదిక వద్ద ఆదివారం ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి అంతర్జాతీయ మహిళా దినోత్సవం లో ఎమ్మెల్సీ పాల్గొని ప్రసంగించారు. యూటిఎఫ్ జిల్లా కార్యదర్శి దండు పద్మావతి అధ్యక్షత వహించారు. ఆధునిక సమాజంలో కూడా మహిళలు పని ప్రదేశం నుంచి మొదలుకొని ప్రతి చోట వారికి వేధింపులు ఎదురవుతున్నాయన్నారు. తుని ముమ్మిడివరం సంఘటన లు ఈ సందర్భంగా ప్రస్తావించారు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నప్పటికీ నేటి ఆధునిక యుగంలో కూడా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలకు విముక్తి లభించలేదన్నారు. సాఫ్ట్వేర్, కార్పొరేట్, ప్రైవేట్, పబ్లిక్, ప్రభుత్వ రంగం ఏదైనా మహిళలు శ్రమ దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మహిళల పట్ల ప్రగతి శీలంగా ఉన్నట్లు కపట నాటకం ప్రదర్శిస్తున్నాయని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాసనసభలో, మండలిలో మహిళల హక్కులకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన బిల్లును పిడిఎఫ్ ఎమ్మెల్సీగా తాను ఓడించటానికి ప్రయత్నం చేశానన్నారు. వైసిపి ఇందుకు వ్యతిరేకంగా వాకౌట్ చేసిందన్నారు. మహిళలకు సమాన హక్కులు కల్పిస్తున్నామని చెప్పడం బూటకమన్నారు. మహిళలకు రాత్రి పూట పురుషులతో సమానంగా పనిచేయించుకోవటం సమానత్వం కాదని, వారికి 175 ఎమ్మెల్యేల్లో సగం మంది మహిళలు, ఉద్యోగాల్లో సగం మంది మహిళలు ఉంటే అది నిజమైన సమానత్వం అన్నారు. కేవలం 24 శాతం మంది మహిళలు మాత్రమే ఉద్యోగాల్లో ఉన్నారని ప్రభుత్వం చెప్పడానికి ఖండించారు. యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి క్రాంతి కుమార్ మాట్లాడుతూ, సమాజంలో, కర్తవ్యం నిర్వహణలో మహిళలు ఒకే విధంగా ముందుకు సాగాలని కోరారు. సిఐటియు, ఐద్వా, యుటిఎఫ్, ఎస్ఎఫ్ఐ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా స్థాయి మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో, బి రాజ్యలక్ష్మి, సరిపల్లి జయప్రభ, ఎన్ అరుణ కుమారి, వి వాణిశ్రీ, గోపిశెట్టి కవిత బేబీ, ఎస్ ఉదయ కుమారి, డి కళ్యాణి, కేత పద్మ, బి సింధు, ది విజయరామరాజు, ఎం వనజాక్షి, పలువురు యుటిఎఫ్ సిఐటియు, ఐద్వా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
సామాజిక అవలక్షణాలపై మహిళలు పోరాడాలి. -ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి పిలుపు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభలో ప్రసంగిస్తున్న ఎమ్మెల్సీ గోపి