విజయవాడ: మార్చి,19(తెలుగు న్యూస్ పవర్. కామ్) తెలుగు ప్రజలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ప్రథమ స్థానంలో నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి గురువారం పాల్గొని ప్రసంగించారు. స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, సాంస్కృతిక శాఖ మాత్యులు కందుల దుర్గేష్, పి తేజస్వి మీ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. నీటి భద్రత విధానం అమల్లోకి తీసుకు వస్తున్నామన్నారు. ఉగాది ప్రాముఖ్యతను గురించి ముఖ్యమంత్రి వివరిస్తూ, ఆచార వ్యవహారాలన్నీ శాస్త్రంతో ముడిపడినవని అన్నారు. రాష్ట్రంలో జనాభా మేనేజ్మెంట్ పాలసీని తీసుకొస్తున్నట్టు తెలిపారు. మూడుసార్లు కృష్ణా,గోదావరి పుష్కరాలు, జరిపించే అదృష్టం తనకి లభించింది అన్నారు. ఈ సందర్భంగా పంచాంగ శ్రవణం చేసిన మాడుగుల నాగఫణి శర్మ , రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండుతాయి అన్నారు. ముఖ్యమంత్రి తన మేధస్సుతో అమరావతిని విశ్వ నగరంగా తీర్చిదిద్దడానికి నిధులు అనుతాయని వెల్లడించారు. అనంతరం వివిధ రంగాలలో ప్రముఖులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఉగాది పురస్కారాలు అందజేశారు. ఎమ్మెల్యే బోండా ఉమ, ఎంపీ కేసినేని చిన్ని, ఉమ్మడి గోపాలకృష్ణ, పూల విక్రం తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
