పాలకొల్లు:డిసెంబర్,30 (తెలుగు న్యూస్ పవర్) భారతీయులు స్నేహపాత్రులని స్పెయిన్ యాత్రికులు కార్లోస్ ప్రశంసించారు. మాజీ పార్లమెంట్ సభ్యులు చేగొండి హరిరామ జోగయ్య నివాసంలో, ఆదివారం రాత్రి మాట్లాడారు. ఇక్కడ ప్రజలు విదేశీయుల పట్ల ఆసక్తి, గౌరవం చూపుతారని గమనించానన్నారు. వారిలో ఓపిక సహనం వంటి సుగుణాలు తనను ఆకర్షించాయన్నారు. కార్లోస్ (29) ప్రస్తుతం భారత యాత్రలో ఉన్నారు. ఈ యాత్ర గత నెల 24న స్పెయిన్ లో ప్రారంభించారు. ఢిల్లీలో ఒక మోటార్ బైక్ అద్దెకు తీసుకుని భారత పర్యటన కొనసాగిస్తున్నారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో పర్యటన ముగించుకుని, ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టినట్టు తెలిపారు. పాలకొల్లు శనివారం సాయంత్రం చేరుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య నివాసంలో కార్లోస్ కు, విందు ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మానవ పరిణామశాస్త్రం తనకు, ఇష్టమైన అంశం అన్నారు. మానవ జాతి ఆవిర్భావం, పరిణామం, సమాజాలు, సంస్కృతులు, భాషలు, వారి ప్రవర్తన గురించి అధ్యయనం చేయడానికి ఈ యాత్ర చేపట్టినట్టు కార్లోస్ వెల్లడించారు. భారతదేశం పర్యాటకులకు స్వర్గధామం వంటిదని హర్షం వ్యక్తం చేశారు. యాత్రను అడ్డుకునే కఠినమైన నిబంధనలు ఏమి లేకపోవడం పట్ల సంతోషం ప్రకటించారు. ప్రస్తుతం వీరి యాత్ర విశాఖపట్నం వైపు సాగుతున్నది. పూరి, కలకత్తా, సిక్కిం, అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్ పర్యటనతో ముగుస్తుంది. ఈ పర్యటన వచ్చే ఏడాది మే నెల ఆఖరికి పూర్తి కావచ్చునని తెలిపారు. ఈ పర్యటన ఖర్చు 13.5 లక్షల రూపాయలుగా అంచనా వేశారు. పలువురు పట్టణ ప్రముఖులు కార్లోస్ ను అభినందించారు. వీరి యాత్ర నిర్విఘ్నంగా కొనసాగాలని ఆకాంక్షించారు.
