
పాలకొల్లు: ఫిబ్రవరి, 5(తెలుగు న్యూస్ పవర్) మహాశివరాత్రి సందర్భంగా, స్థానిక క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయం వద్ద ఏర్పాట్ల గురించి తహశిల్దార్ యడ్ల దుర్గా కిషోర్ అధ్యక్షతన, వారి కార్యాలయంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఈనెల 12 నుంచి 16వ తేదీ వరకు మహాశివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. మహాశివరాత్రి ఈనెల 15న అత్యంత వైభవంగా జరిపించాలని సమావేశంలో తీర్మానించారు. భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలక్కుండా ఉండటానికి తహసిల్దార్ కిషోర్ వివిధ శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తులకు వేగంగా దర్శనం కావడానికి తగు విధమైన క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని కోరారు. లింగోద్భవ సమయంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటం వల్ల ఆలయం లోపల ఎక్కువమంది సిబ్బందిని నియమించాలని సూచించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే ఆర్టీసీ, ప్రైవేటు బస్సులకు స్థానిక మార్కెట్ యార్డ్ లో పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం మార్గ సూచీలు దేవస్థానం వారు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పోలీసులు, ఫైరు సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు. విద్యుత్ దీపాలంకరణకు సంబంధించి ఏఈ, సిబ్బందిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది భక్తులకు అత్యవసర సమయంలో సిద్ధంగా ఉండాలని కోరారు. మరుగుదొడ్ల ప్రాంతం లో ఏ విధమైన సమస్యలు తలెత్తకుండా మున్సిపల్ సిబ్బంది నీటి సరఫరా, పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఉచిత ప్రసాదాల పంపిణీ కార్యక్రమం సజావుగా సాగటానికి పలు సూచనలు చేశారు. ప్లాస్టిక్ సంచుల వినియోగాన్ని నిషేధించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి చర్చించారు.ఈ కార్యక్రమంలో, ఆలయ కార్య నిర్వహణ అధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు،ధర్మకర్తల మండల చైర్మన్ మీసాల రామచంద్ర రావు, పినిశెట్టి శ్రీనివాసరావు, ధర్మకర్తలు, మున్సిపల్ కమిషనర్ విజయ సారథి, ఆరోగ్యశాఖ అధికారి, పట్టణ సీఐ రజిని కుమార్, అగ్నిమాపక శాఖ అధికారి రాజ్ కుమార్, విద్యుత్ శాఖ ఏఈ బాబ్జి, తదితరులు పాల్గొన్నారు.