ముమ్మడివరం: జూన్, 21( తెలుగు న్యూస్ పవర్. కామ్ )
అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం మండలం కొత్తమురమళ్ల గ్రామంలో ఈ నెల 17న జరిగిన ఆక్వా రైతు దాట్ల కృష్ణంరాజు (64) హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్య అనంతరం మృతదేహానికి తాళ్లతో రాళ్లు కట్టి చెరువులో పడవేసిన ఈ సంచలన ఘటనలో నిందితులను శనివారం తెల్లవారుజామున కాకినాడలోని ఓ గదిలో ఉన్న సమయంలో అరెస్టు చేసినట్లు డీఎస్పీ టి.ఎస్.ఆర్.కె. ప్రసాద్ తెలిపారు.ఐ. పోలవరం పోలీస్ స్టేషన్‌లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ కేసు వివరాలను వెల్లడించారు.
చెరువుల వద్ద పనిచేస్తున్న విశాఖపట్నం జిల్లాకు చెందిన సాలపురెడ్డి బాజీతో పాటు మరో 17 ఏళ్ల మైనర్ బాలుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. విచారణలో నిందితులు కీలక విషయాలు వెల్లడించినట్లు చెప్పారు.
చెరువు యజమాని కృష్ణంరాజు పని విషయంలో తరచూ తమను దూషించేవారని, దీంతో పని మానేసి, చేసిన పనికి జీతం తీసుకుని వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నామని నిందితులు తెలిపినట్లు డీఎస్పీ వెల్లడించారు. అందులో భాగంగా నిందితుడు తన భార్యను ముందుగానే కాకినాడకు పంపించాడన్నారు.జీతాన్ని ఫోన్‌పే ద్వారా చెల్లించే సమయంలో యజమాని పిన్ నంబర్‌ను గమనించిన నిందితులు, అతని ఖాతాలో ఉన్న నగదును కాజేయాలనే ఉద్దేశంతో కుట్ర పన్నారని తెలిపారు. అనంతరం కృష్ణంరాజును ఇనుప రాడ్‌తో కొట్టి హత్య చేసినట్లు విచారణలో ఒప్పుకున్నారని చెప్పారు.హత్య అనంతరం మృతుడి మోటార్‌సైకిల్‌ను వేరే ప్రాంతంలో వదిలివేసి, సెల్‌ఫోన్‌ను తీసుకెళ్లారని తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా సెల్‌ఫోన్, మోటార్‌సైకిల్‌తో పాటు హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.నిందితులు ఇప్పటికే రూ.90 వేల నగదును మరో బ్యాంకు ఖాతాకు బదిలీ చేసుకున్నట్లు గుర్తించామని, ఆ మొత్తాన్ని కూడా స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టినట్లు డీఎస్పీ తెలిపారు.
ఇతర ప్రాంతాల నుంచి పనికి వచ్చే వారి పూర్తి వివరాలు తెలుసుకోకుండా ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నారని పేర్కొంటూ, భవిష్యత్తులో యజమానులు కార్మికులను పనిలోకి తీసుకునే ముందు వారి ఆధార్ కార్డు, ఫోటోలు, చిరునామా వివరాలను తప్పనిసరిగా సేకరించాలని సూచించారు.
ఈ కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసే వరకు చురుకుగా వ్యవహరించిన ముమ్మిడివరం సీఐ ఎం.ఎం. మోహన్‌కుమార్, ఎస్సై ఎం.వి.వి. రవీంద్రబాబుతో పాటు దర్యాప్తు బృందాన్ని డీఎస్పీ అభినందించారు.
కొత్తవారిని పనిలో పెట్టుకోవద్దు. పోలీసుల హెచ్చరిక. ఆక్వా రైతు హత్య కేసును ఛేదించిన పోలీసులు