తాడేపల్లిగూడెం: జూన్, 21( తెలుగు న్యూస్ పవర్.
కామ్)నిష్పాక్షికంగా వార్తలు రాయటం ద్వారా జర్నలిస్టులు తమ విశ్వసనీయతను కాపాడుకోవాలని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ ( ఐ.జే.యు.) సెక్రటరీ జనరల్ డి. సోమసుందర్ పిలుపునిచ్చారు. విధినిర్వహణలో పలురకాల ఒత్తిడులు ఎదుర్కుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో వృత్తి ప్రమాణాలను పాటించడమే పాత్రికేయులకు తగురక్షణ కల్పిస్తుందని సోమసుందర్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం కడకట్ల రోడ్ లోని సోమసుందర్ గృహంలో ఏ.పి.యు.డబ్ల్యూ.జె.
తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆయన జన్మదిన వేడుకలను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు పాత్రికేయులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా డి. సోమసుందర్ మాట్లాడుతూ సమాజంలో వివిధ రాజకీయ పార్టీలు, సంస్థలు, వ్యక్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారని, ఆ సమాచారాన్ని వార్తలుగా రాసి ప్రజలకు అందించడమే పాత్రికేయులు నిర్వహించాల్సిన బాధ్యత అని గుర్తు చేశారు.
అవాస్తవాలకు, అర్ధ సత్యాలకు వక్రీకరణలకు తావీయకుండా వార్తలు రాసే జర్నలిస్టులకు సమాజంలో విశ్వసనీయత, గౌరవం ఉంటుందని అన్నారు. తమ ప్రయోజనాలకు భంగం కలిగిందని భావించే వర్గాల నుండి ఇబ్బందులు ఎదురైనా అవి తాత్కాలికమేనని, జర్నలిస్టులు ఐక్యంగా ఉంటే అలాంటి వాటిని ఎదుర్కోవచ్చని సోమసుందర్ సూచించారు.
జర్నలిస్టుల ఆరోగ్యం, ప్రమాద బీమా, పింఛన్లు, ఇళ్ళ స్థలాలు , పిల్లల చదువులు వంటి న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఏ.పి.యు.డబ్ల్యూ.జే. కృషి చేస్తున్నదని తెలిపారు. యూనియన్ ను పటిష్టం చేసుకుంటే వర్కింగు జర్నలిస్టుల గొంతుకగా సంఘం పనిచేస్తుందని అన్నారు.
పలువురు పాత్రికేయులు మాట్లాడుతూ జర్నలిజంలో నైతిక విలువల పరిరక్షణకు, పాత్రికేయ కుటుంబాల సంక్షేమానికి యూనియన్ సాగించిన కృషిలో సోమసుందర్ కీలక భూమిక పోషిస్తున్నారని ప్రశంసించారు. ఆయన మార్గదర్శకత్వంలో పాత్రికేయులు ముందుకు సాగాలని , యూనియన్ పటిష్టతకు పూనుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏ.పి.యూ.డబ్ల్యూ.జె. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు యడ్లపల్లి మురళి, జిల్లా కార్యదర్శి గజపతి ప్రసాద్, సీనియర్ జర్నలిస్టులు ఖాదర్ మొహిద్దీన్, తేతలి గంగాధర రెడ్డి, చిట్యాల రాంబాబు, ఆలమండ నరసింహారావు, కోలాటి మోషే బాబు, చిక్కాల రామకృష్ణ, మైలవరపు రవి కిరణ్ , శీలి రాజు, వానపల్లి పుండరీకాక్షుడు, శీలి మహేష్, మారంపూడి యేసు, బాసింశెట్టి బాలాజీ, సింగులూరి వీర్రాజు, చిట్రోజు కృష్ణ , యద్దనపూడి సుబ్బారావు, పాలడుగు సతీష్ , కళింగ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
ఎఐటియుసి ఏరియా సమితి ఆధ్వర్యంలో పలు కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు, కుటుంబసభ్యులు , స్నేహితులు సోమసుందర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పలువురు మిత్రులు ఆయనకు మొక్కలను బహూకరించారు.
జర్నలిస్టులు విశ్వసనీయత కాపాడుకోవాలి- ఐ.జే.యు. నేత డి. సోమసుందర్
సోమ సుందరకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్న జర్నలిస్టులు