Skip to main content

Telugu News Power

అమరావతి చిత్రకళ వీధి భారీ ప్రదర్శన. గుంటూరులో ఈనెల 8, 9 రెండు రోజులు.

విజయవాడ: ఆగస్టు, 6( తెలుగు న్యూస్ పవర్. కామ్)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి కమిషన్ ఆధ్వర్యంలో ఈనెల 8, 9 తేదీల్లో గుంటూరులో “అమరావతి చిత్రకళా వీధి” నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర సాంస్కృతిక శాఖ మాత్యులు కందుల దుర్గేష్ గురువారం తెలిపారు. రాష్ట్రంలోనే అతిపెద్ద కళా ఉత్సవంగా నిర్వహిస్తామన్నారు. ఇందుకు సంబంధించిన గోడ పత్రికను విజయవాడలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. మన రాష్ట్ర కళా, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ మహోత్సవంలో దేశం నలుమూలల నుంచి కళాకారులు పాల్గొని తమ సృజనాత్మక ప్రతిభను ప్రదర్శించనున్నారని వెల్లడించారు. ఈ ప్రదర్శనలో 800కు పైగా చిత్రకళ, హస్తకళ దుకాణాలు, 9 ప్రత్యక్ష కళా వేదికలు, లైవ్ ఆర్ట్ ఇన్‌స్టాలేషన్స్, సంగీత-సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ కోర్టులు, ప్రత్యేక ఫోటో జోన్లు వంటి అనేక ఆకర్షణలు సందర్శకులను అలరిస్తాయన్నారు .గత ఏడాది రాజమహేంద్రవరంలో నిర్వహించిన చిత్రకళా వీధికి లభించిన విశేష ఆదరణను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేలా ఈసారి ప్రజారాజధాని అమరావతికి సమీపంలోని గుంటూరులో ఈ కళా సంబరాన్ని మరింత వైభవంగా నిర్వహించనున్నట్టు తెలిపారు. కళాకారుల ప్రతిభకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడం, మన సంస్కృతి గొప్పదనాన్ని భావితరాలకు చేరవేయడం, కళలకు కొత్త అవకాశాలు కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు. కళాభిమానులు, విద్యార్థులు, కుటుంబ సమేతంగా రాష్ట్ర ప్రజలందరూ ఈ అద్భుత కళా వేడుకకు కుటుంబ సమేతంగా విచ్చేసి “అమరావతి చిత్రకళా వీధి” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.