పాలకొల్లు: ఆగస్టు 15( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణ
మూర్తి ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఆగస్టు 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కడలి రత్నమాణిక్యం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా స్టూడెంట్ కౌన్సిల్, ఎన్ ఎస్ ఎస్ యూనిట్లు 1, 2, కల్చరల్ కమిటీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగాల ఆధ్వర్యంలో విద్యార్థులకు వివిధ సాంస్కృతిక, క్రీడా, సాహిత్య పోటీలు నిర్వహించారు. దేశభక్తి భావాన్ని, జాతీయ సమైక్యతను చాటిచెప్పే విధంగా 100 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ,భారతదేశ పటం మానవహారం, “అనే నేను” వీడియో క్యాంపెయిన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఆగస్టు 15వ తేదీ శనివారం కళాశాల ప్రాంగణంలో జరిగిన ప్రధాన వేడుకల్లో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కడలి రత్నమాణిక్యం జాతీయ జెండాను ఆవిష్కరించారు. విద్యార్థులు, సిబ్బంది జాతీయ గీతాన్ని ఆలపించి, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమానికి కళాశాల అభివృద్ధి కమిటీ సభ్యులు అద్దేపల్లి మోహన్ దాస్, కారుమూరి రామలింగేశ్వరరావు, కొమ్ముల మురళీకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ కడలి రత్నమాణిక్యం మాట్లాడుతూ, స్వాతంత్ర్యం అనేది కేవలం హక్కు మాత్రమే కాదని, దేశ అభివృద్ధి పట్ల ప్రతి పౌరుడికి బాధ్యతను కూడా అన్నారు. యువత విద్యతో పాటు దేశభక్తి, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతలను అలవరచుకొని వికసిత భారతదేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ముఖ్య అతిథులు మాట్లాడుతూ, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు దేశ ప్రగతికి తమ వంతు కృషి చేయాలని అన్నారు. విద్యార్థుల్లో జాతీయ సమైక్యత, దేశభక్తి, నాయకత్వ లక్షణాలను పెంపొందించడంలో ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. ఆగస్టు 10 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించిన వివిధ సాంస్కృతిక, క్రీడా, సాహిత్య పోటీలలో విజేతలైన విద్యార్థులకు ముఖ్య అతిథులు, ప్రిన్సిపాల్ బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ టి కృష్ణ, ఐ క్యు ఏసి కోఆర్డినేటర్ డాక్టర్ భూసి వెంకటస్వామి,అకాడమిక్
కోఆర్డినేటర్ జి సుమలత, ఇంగ్లీష్ విభాగాధిపతి కే శామ్యూల్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ ఎమ్ రామకృష్ణ, డాక్టర్ వి డి వి విజయలక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్ పి దుర్గా రావు,ఇతర అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
అద్దేపల్లి కళాశాలలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
కళాశాల వద్ద జండా వందనం చేస్తున్న దృశ్యం