
హైదరాబాద్: ఆగస్టు,21( తెలుగు న్యూ పవర్. కామ్) తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి నేడు జన్మదినం జరుపుకుంటున్నారు. నటుడిగా నాలుగు దశాబ్దాలకు పైగా కోట్లాది మంది అభిమానులను అలరిస్తూనే, సామాజిక సేవలోనూ తనదైన ముద్ర వేసిన చిరంజీవికి దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులు, అభిమానులు, రాజకీయ నాయకులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
సినీ రంగంలో ప్రత్యేక ప్రస్థానం
చిరంజీవి 1978లో సినీ రంగ ప్రవేశం చేసి అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్‌గా అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. కమర్షియల్ సినిమాలతో పాటు సామాజిక సందేశాన్ని అందించే చిత్రాల్లోనూ నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి దేశ అత్యున్నత పురస్కారాలు ఆయన సినీ, సామాజిక సేవలకు లభించిన గౌరవానికి నిదర్శనంగా నిలిచాయి.
1998లో సేవా కార్యక్రమాలకు శ్రీకారం
చిరంజీవి 1998 అక్టోబర్ 2న చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ (సీసీటీ )ను ప్రారంభించారు. రక్తం అందక ఎవరూ ప్రాణాలు కోల్పోకూడదనే లక్ష్యంతో బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్‌లను ఏర్పాటు చేశారు. ట్రస్ట్ వివరాల ప్రకారం ఇప్పటివరకు సుమారు 9.30 లక్షల యూనిట్ల రక్తాన్ని సేకరించగా, అందులో 79 శాతం రక్తాన్ని పేదలు, అవసరమైన వారికి ఉచితంగా అందించారు. అలాగే 4,580 జతల నేత్రాలను సేకరించి, కార్నియా మార్పిడి ద్వారా 9,060 మంది చూపును పొందేందుకు సహకరించింది.
కరోనా సమయంలోనూ అండగా,కరోనా మహమ్మారి సమయంలో చిరంజీవి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాయి. ఆక్సిజన్ కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జిల్లాల్లో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేసి అవసరమైన వారికి ఉచితంగా ఆక్సిజన్ అందించారు. అలాగే సినీ పరిశ్రమలో ఉపాధి కోల్పోయిన కార్మికులకు సహాయం చేసేందుకు కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ ) ద్వారా నిత్యావసర సరుకులు, ఆర్థిక సహాయం, ఉచిత వ్యాక్సినేషన్ వంటి కార్యక్రమాలకు సహకరించారు.
అభిమానుల సేవా కార్యక్రమాలకు స్ఫూర్తి
చిరంజీవి తన అభిమాన సంఘాలను కేవలం సినీ అభిమానుల వేదికలుగా కాకుండా సేవా కార్యక్రమాలకు అనుసంధానించారు. ఆయన జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరాలు, నేత్రదాన అవగాహన కార్యక్రమాలు, అన్నదానం, పేదలకు సహాయ కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా మారింది.
నటుడిగా సంపాదించిన ప్రజాదరణను సేవా కార్యక్రమాలకు అనుసంధానించి.. “అభిమానం అంటే కేవలం ఆరాధన కాదు.. ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం” అనే స్ఫూర్తిని చిరంజీవి అభిమానులకు అందించారు.
జన్మదినం సందర్భంగా మెగాస్టార్‌కు శుభాకాంక్షలు
సినిమా తెరపై ఎన్నో పాత్రలతో ప్రేక్షకులను అలరించిన చిరంజీవి.. నిజ జీవితంలో సేవా కార్యక్రమాల ద్వారా వేలాది కుటుంబాలకు అండగా నిలిచారు. ఆయన జన్మదినం సందర్భంగా మరెన్నో సంవత్సరాలు సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజలను అలరిస్తూ, సేవా కార్యక్రమాలకు మరింత స్ఫూర్తిగా నిలవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. చిరంజీవి జననోత్సవం సందర్భంగా, మెగా అభిమానులకు రూ 5 లక్షల ఉచిత భీమా పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు అఖిల భారత చిరంజీవి అభిమాన సంఘం నాయకులు రవణం స్వామి నాయుడు తెలిపారు.
