పోలీసు అదికారులు మరియు సిబ్బందికి దిశానిర్దేశం చేసిన ఏలూరు రేంజ్ ఐజీ జి.వి.జి అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు పశ్చిమగోదావరి జిల్లా, నర్సాపురం, మొగల్తూరు గ్రామంలో నిర్వహించనున్న “పేదల సేవలో పెన్షన్ల పంపిణీ, ప్రజా వేదిక” కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తూ, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు పోలీసు అధికారులు సోమవారం తెలిపారు. ఈ నేపథ్యంలో, నర్సాపురం మండలం, సీతారాంపురంలోని స్వర్ణాంధ్ర కళాశాల ప్రాంగణంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమీక్షా సమావేశంలో ఏలూరు రేంజ్ ఐజీ జి.వి.జి. అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, ఐపీఎస్, పాల్గొని బందోబస్తు విధులలో ఉన్న పోలీసు అధికారులకు, సిబ్బందికి బందోబస్తు విధులపై దిశా నిర్దేశం చేశారు.
ఈ పర్యటనలో దాదాపు 1300 మంది పోలీసు సిబ్బందితో పటిష్టమైన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఉన్నతాధికారులు ప్రకటించారు. ముఖ్యమంత్రి రాక, తిరిగి వెళ్లే వరకు ప్రతి అడుగును పర్యవేక్షించేలా బందోబస్తును సెక్టార్ల వారీగా విభజించి, స్పష్టమైన ప్రణాళికలను రూపొందించారు. హెలిప్యాడ్ భద్రత, సభా ప్రాంగణం, కాన్వాయ్ ప్రయాణించే రహదారి మార్గాలు, మరియు ప్రజా ప్రతినిధుల సమావేశ ప్రాంతాలను ప్రత్యేక సెక్టార్లుగా గుర్తించి, ఆయా విధుల్లో ఉన్న సిబ్బందికి బాధ్యతలను కేటాయించారు. ముఖ్యంగా రోప్ పార్టీలు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, పార్కింగ్ మేనేజ్మెంట్ మరియు చెక్ పోస్టుల నిర్వహణలో అనుసరించాల్సిన వ్యూహాలను ఐజీ, ఎస్పీ స్వయంగా వివరించారు.
సమీక్షా సమావేశంలో ఉన్నతాధికారులు మాట్లాడుతూ, కేటాయించిన విధులలో ఏమాత్రం అలసత్వం వహించినా సహించేది లేదని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇతర శాఖల అధికారులతో నిరంతర సమన్వయం కలిగి ఉంటూ, ఎంతో సంయమనంతో, అప్రమత్తతతో విధులు నిర్వహించాలని ఆదేశించారు. పర్యటనకు విచ్చేసే ప్రజలకు మరియు కార్యకర్తలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడటమే పోలీసు శాఖ యొక్క ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.