Skip to main content

Telugu News Power

పిఠాపురంలో ఘనంగా జనసేన యువజన విభాగం‘జై కొట్టు’ ఆవిష్కరణ కార్యక్రమం.

జండా పట్టి జై కొడుతున్న జనసేన నాయకులు
వేదిక వద్ద యువజన విభాగం కోలాహలం

ప్రత్యేక ఆకర్షణగా.. వేలాది బైకులతో ర్యాలీ

జై జనసేన నినాదాలతో మారుమోగిన పిఠాపురం

వేడుకలకు ప్రత్యేక శోభ తీసుకొచ్చిన ప్రత్యేక గీతం, ఏవీలు.

వైభవంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కేక్ కటింగ్

జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ స్థానం పిఠాపురం వేదికగా పార్టీ యువజన విభాగం ‘జై కొట్టు’ ఆవిష్కార సభ బుధవారం జరిగింది. జన సైనికులు, వీర మహిళలు, నాయకుల కోలాహలం నడుమ ‘జై కొట్టు’ విభాగం మొదలు కావడంతో నవ యువతలో ఆనందోత్సాహాలు వెల్లి విరిశాయి. ఇదే వేదిక నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ వేడుకలను నిర్వహించారు.
పిఠాపురం నియోజకవర్గం అంతటా పండగ వాతావరణాన్ని తలపించింది. జన్మదిన వేడుకల్లో జనసైనికులు, వీరమహిళలు, అభిమానులు, యువత వేల సంఖ్యలో పాల్గొనడంతో పిఠాపురం జనసంద్రమైంది. ఎంతో ఉత్సాహభరిత వాతావరణంలో అభిమానులు ఈ జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.
ప్రత్యేక ఆకర్షణగా బైక్ ర్యాలీ
‘జై కొట్టు’ కార్యక్రమంలో పాల్గొనేందుకు కాకినాడ జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది యువత ఉత్సాహంగా బైక్ ర్యాలీలుగా బయలుదేరి చిత్రాడకు చేరుకున్నారు. అక్కడి నుంచి అందరూ ఒక్కటై భారీ ర్యాలీగా పిఠాపురంలోని ‘జై కొట్టు’ ఆవిష్కరణ వేదిక వద్దకు చేరారు. జనసేన జెండాలతో అలంకరించిన వేలాది ద్విచక్ర వాహనాలు, మారుమోగిన “జై జనసేన”, ‘జై పవన్ కళ్యాణ్’ నినాదాల మధ్య ర్యాలీ అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది. వేలాది బైకులతో యువత చేసిన ర్యాలీ విశేషంగా ఆకట్టుకుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యువత ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొని జన్మదిన వేడుకలకు మరింత సందడిని తీసుకొచ్చారు. జనసేన పార్టీపై యువతకు ఉన్న ఆదరణ, నమ్మకాన్ని ఈ భారీ బైక్ ర్యాలీ ప్రతిబింబించింది. పెద్ద సంఖ్యలో యువకులు స్వచ్ఛందంగా పాల్గొని పిఠాపురం చేరుకోవడంతో పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది.
అలరించిన జై కొట్టు థీమ్ సాంగ్
యువజన విభాగానికి “జై కొట్టు” అనే ప్రత్యేక నామకరణం చేశారు. యువతలో ఉత్సాహం, పోరాట స్ఫూర్తి, ఐక్యతను ప్రతిబింబించేలా పిడికిలి బిగించి జై కొట్టే రూపకల్పనతో ప్రత్యేక లోగోను రూపొందించారు. చూడగానే యువతను ఆకర్షించే విధంగా రూపొందిన ఈ లోగో కార్యక్రమానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. అలాగే ప్రత్యేకంగా రూపొందించిన గీతం యువతను విశేషంగా ఆకట్టుకుంది. “జై జై జై జై జై కొట్టు.. జన సైనికుడై కదం తొక్కి కట్టరా జట్టు” అంటూ ఉత్సాహభరితంగా సాగిన ఈ పాట యువతలో కొత్త ఉత్సాహాన్ని, పోరాట స్ఫూర్తిని నింపింది. పాటలోని సందేశం, సంగీతం, దృశ్య రూపకల్పన సమన్వయంగా ఉండటంతో కార్యక్రమం మరింత ఆకర్షణీయంగా మారింది. కార్యక్రమం కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఏవీలు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. యువతను ఉత్తేజపరిచే సందేశాలతో రూపొందించిన దృశ్యాలు కార్యక్రమానికి ప్రత్యేక వైభవాన్ని తీసుకొచ్చాయి. పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, యువత సమక్షంలో నాదెండ్ల మనోహర్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ, పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ కళ్యాణం శివ శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ ఛైర్మన్ తోట సుధీర్, కాకినాడ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్‌ తలాటం సత్య, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ చల్లా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.