Skip to main content

Telugu News Power

అఖిల భారత పోలీసు క్రీడల్లో సత్తా చాటిన ఏపీ పోలీస్ 11 పతకాలతో జాతీయ స్థాయిలో ప్రతిభ.

అమరావతి:ఆగస్టు, 5( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ 11వ అఖిల భారత పోలీసు క్రీడలు–2026లో అద్భుత ప్రతిభ కనబరిచింది. మొత్తం 11 పతకాలను కైవసం చేసుకుంది. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం ఆధ్వర్యంలో జూలై 23 నుంచి 30 వరకు హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ క్రీడల్లో ఏపీ పోలీసు క్రీడాకారులు రాష్ట్రానికి గర్వకారణమైన విజయాన్ని అందించారు.
ఏపీ పోలీసు జట్టు మొత్తం 5 స్వర్ణ పతకాలు, 3 రజత పతకాలు, 3 కాంస్య పతకాలు సాధించి విశేష ప్రతిభ చాటింది.
ఈ విజయాన్ని పురస్కరించుకుని రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ) హరీష్ కుమార్ గుప్తా, ఐపీఎస్ పతక విజేతలను తన కార్యాలయంలో సత్కరించి అభినందించారు. విధి నిర్వహణలోనే కాకుండా క్రీడల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ రాష్ట్రానికి జాతీయ స్థాయిలో కీర్తి తీసుకొచ్చిన పోలీసు క్రీడాకారులను ఆయన ప్రశంసించారు.
భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో మరిన్ని విజయాలు సాధించి ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖకు మరింత గౌరవాన్ని తీసుకురావాలని డీజీపీ ఆకాంక్షించారు.
ఈ సత్కార కార్యక్రమంలో ఐజీపీ (స్పోర్ట్స్) కె.వి. మోహన్‌రావు, ఐపీఎస్, డీఐజీ (వెల్ఫేర్ అండ్ స్పోర్ట్స్) కె.కె.ఎన్. అన్‌బురాజన్, ఐపీఎస్, క్రీడా అధికారి, కోచ్‌లు, పతక విజేతలు మరియు పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.