
పరీక్షల్లో 552 మందికి దృష్టి లోపాలు,
40 మందికి శుక్లాల గుర్తింపు
ఉచిత కళ్లద్దాలు, శస్త్రచికిత్స సదుపాయం.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశంతో వరుస నేత్ర వైద్య శిబిరాలు.
నరసాపురం: ఆగస్టు, 9
( తెలుగు న్యూస్ పవర్. కామ్)
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశంతో నరసాపురం ఇంటర్నేషనల్ లేస్ ట్రేడ్ సెంటర్లో 700 మంది క్రోచెట్ లేస్ కళాకారులకు కంటి పరీక్షలు ఆదివారంనిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవం వేదికపై నుంచి పవన్ కళ్యాణ్ ఇచ్చిన సూచనలతో నిరంతర పర్యవేక్షణ ఫలితంగా ఇప్పటికే 141 మంది క్రోచిట్ లేస్ కళాకారులకు ఉచిత కళ్లద్దాలు అందజేశారు. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మరో 700 మంది లేస్ కళాకారులకు కంటి పరీక్షలు నిర్వహించారు. కాకినాడకు చెందిన కిరణ్ కంటి ఆసుపత్రి సహకారంతో ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అత్యాధునిక పరికరాలతో సమగ్ర కంటి పరీక్షలు చేపట్టారు.
శిబిరానికి హాజరైన 700 మందికి పైగా చేనేత కార్మికులు, క్రోచిట్ లేస్ కళాకారులకు కంప్యూటరైజ్డ్ పవర్ టెస్టులు, కంటి ఒత్తిడి పరీక్షలు, రెటీనా స్కానింగ్, స్లిట్-ల్యాంప్ పరీక్షలు, రక్తంలో చక్కెర స్థాయిల నిర్ధారణ తదితర పరీక్షల ద్వారా వారి కంటి ఆరోగ్యాన్ని సమగ్రంగా అంచనా వేశారు. పరీక్షల్లో 552 మందికి కళ్లద్దాలు అవసరమని నిర్ధారణ కావడంతో వారికి ఉచితంగా కళ్లద్దాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దృష్టి లోపాలు ఉన్న కళాకారులు తమకు నచ్చిన ఫ్రేమ్‌లను ఎంపిక చేసుకునే అవకాశం కల్పించడం విశేషం. కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి అవసరమైన మందులు, కంటి చుక్కలను కూడా ఉచితంగా పంపిణీ చేశారు. పరీక్షల్లో 40 మందికి శుక్లాలు ఉన్నట్లు గుర్తించగా, వారిలో 15 మందికి కాకినాడ కిరణ్ కంటి ఆసుపత్రిలో సోమవారం ఉచిత శస్త్రచికిత్సలు నిర్వహించనున్నారు. శస్త్రచికిత్స సమయంలో రోగులతోపాటు వారి సహాయకులకు కూడా ఉచిత వసతి కల్పించనున్నారు. సోమవారం శస్త్రచికిత్స చేయించుకునే కళాకారులను ఒక రోజు పర్యవేక్షణ అనంతరం మంగళవారం డిశ్చార్జ్ చేయనున్నారు. మిగిలిన 25 మందికి వారి సౌకర్యానుసారం తదుపరి తేదీల్లో శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు వైద్యులు అంగీకరించారు. ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 20 మంది పారా మెడికల్ సిబ్బందిని, అంబులెన్సులను అందుబాటులో ఉంచారు.