
జనరల్ డెస్క్(తెలుగు న్యూస్ పవర్. కామ్):ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కావడం, అకాల వర్షాలు, తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడటంతో, ‘ఎల్ నినో’ వల్ల భూమికి ఏమైనా ముప్పు ఉందా? ఇది భూమి అంతానికి దారితీస్తుందా? అనే చర్చలు సోషల్ మీడియాలో జోరందుకున్నాయి. అయితే, దీనిపై వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్న అసలు నిజాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ఎల్ నినో అంటే ఏమిటి? అది అంతానికి దారి తీస్తుందా?
మొదటిగా మనం గ్రహించాల్సింది,ఎల్ నినో అనేది కొత్తగా వచ్చిన ఆపద కాదు. ఇది శతాబ్దాలుగా పసిఫిక్ మహాసముద్రంలో ప్రతి 2 నుండి 7 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఒక సహజమైన ప్రక్రియ. ఇది వచ్చినప్పుడు సముద్ర ఉపరితల జలాలు వేడెక్కి,
ప్రపంచవ్యాప్తంగా గాలుల దిశలు, వర్షపాత విధానాలు మారుతాయి. కాబట్టి, కేవలం ఎల్ నినో వల్ల మాత్రమే భూమి అంతం కాదు.
ఆందోళన కలిగిస్తున్న ‘ట్విన్ ఎఫెక్ట్’ (జంట చర్య )
మరి శాస్త్రవేత్తలు ఎందుకు హెచ్చరిస్తున్నారు? ఇక్కడే అసలు సమస్య దాగి ఉంది. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య గ్లోబల్ వార్మింగ్ (భూతాపం). కాలుష్యం వల్ల భూమి ఇప్పటికే వేడెక్కి ఉంది. దీనికి తోడు ‘సూపర్ ఎల్ నినో’లు తోడైనప్పుడు (ముఖ్యంగా ఇటీవల 2023-2024 మరియు ప్రస్తుతం 2026 లో కనిపిస్తున్న పరిస్థితుల లాగా) వాతావరణం మరింత అల్లకల్లోలంగా మారుతుంది. ఐక్యరాజ్యసమితి (యూఎన్ఓ) నిపుణుల ప్రకారం, ఇది భూమి అంతానికి కారణం కాకపోయినా, మానవ జీవనానికి తీవ్ర సవాళ్లను విసురుతుంది.
ఐక్యరాజ్యసమితి హెచ్చరిక: పారిస్ ఒప్పందం ప్రకారం భూమి ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5° సెంటిగ్రేడ్ లోపు నియంత్రించాలి. కానీ తీవ్రమైన ఎల్ నినో ప్రభావం వల్ల ఈ పరిమితి దాటిపోయే ప్రమాదం ఉంది. ఇది వాతావరణ సమతుల్యతను దెబ్బతీస్తుంది.
ఎదురయ్యే ప్రధాన ముప్పులు:
ఆహార సంక్షోభం (ముఖ్యంగా వరి పంటకు): ఎల్ నినో వల్ల ఆసియా ఖండంలో (భారతదేశం, చైనా వంటి దేశాల్లో) రుతుపవనాలు బలహీనపడి కరువు వస్తుంది. ప్రపంచ జనాభాలో సగానికి పైగా ప్రజలు తినే బియ్యం (వరి) ఉత్పత్తి ఘోరంగా పడిపోయి, తీవ్ర ఆహార కొరత ఏర్పడే అవకాశం ఉందని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తీవ్రమైన దావానలాలు (కార్చిచ్చు ): ఆస్ట్రేలియా, ఇండోనేషియా వంటి దేశాల్లో అడవులు తగలబడిపోయే ప్రమాదం పెరుగుతుంది.
సముద్ర జీవుల నాశనం: సముద్రపు వేడి పెరగడం వల్ల కోరల్ రీఫ్స్ (పగడపు దిబ్బలు) చనిపోతున్నాయి. ఇది సముద్ర పర్యావరణ వ్యవస్థను దెబ్బతీస్తుంది. చెప్పాలంటే,
ఎల్ నినో అనేది భూమిని అంతం చేసే ప్రళయం కాదు. కానీ, మానవుడు చేస్తున్న కాలుష్యం అనే అగ్నికి ఈ ఎల్ నినో ‘ఆజ్యం’ పోసినట్లు మారుతుంది. మనం పర్యావరణాన్ని కాపాడుకుంటే ఎల్ నినో వంటి సహజ మార్పుల నుండి సులభంగానే తప్పించుకోవచ్చు.
యూరప్‌ను వణికిస్తున్న వేడిగాలులకు కారణాలు, పరిణామాలు పరిశీలిస్తే,
2026వ సంవత్సరంలో యూరప్ ఖండం అసాధారణమైన, రికార్డు స్థాయి వేడిగాలుల బారిన పడింది. మే నెల చివరి వారం నుంచి మొదలైన ఈ వేడిమి పరంపర, జూన్ నెలలో మరింత తీవ్రమై, జులై నెలలోకి కూడా కొనసాగుతోంది. ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, ఇటలీ, బెల్జియం, నెదర్లాండ్స్, పోలాండ్, హంగరీ, రొమేనియా, యూకే సహా అనేక దేశాల్లో ఉష్ణోగ్రతలు గత రికార్డులను బద్దలుకొట్టాయి.
ఎంత తీవ్రంగా ఉంది.మే 24న మొదలైన మొదటి వేడిగాలిలోనే సాధారణ ఉష్ణోగ్రతల కంటే 10–15 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ నమోదైంది. జూన్ చివరి వారంలో ఫ్రాన్స్‌లోని పుల్లోవ్ పట్టణంలో ఏకంగా 43.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఫ్రాన్స్ దేశవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రత జూన్ 24న 30 డిగ్రీలకు చేరి, 2003, 2019 నాటి రికార్డులను అధిగమించింది. దేశంలోని 58 ప్రాంతాలకు అత్యధిక స్థాయి ‘రెడ్ అలర్ట్’ జారీ చేశారు. రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా కొత్త రికార్డు స్థాయికి (22 డిగ్రీలు) చేరుకోవడం గమనార్హం.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ ఓ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ తెలిపిన వివరాల ప్రకారం, జూన్ 21 నుంచి యూరప్‌లో 1,300కు పైగా అదనపు మరణాలు వేడిమి కారణంగా నమోదయ్యాయి. దాదాపు 15 కోట్ల మంది ప్రజలు ఈ వేడిగాలుల ప్రభావానికి గురయ్యారు. ఒక్క ఫ్రాన్స్‌లోనే 1,000కి పైగా అదనపు మరణాలు సంభవించాయని, అందులో 40 మంది వరద కాలువలు, నదుల్లో మునిగి మృతి చెందారని నివేదికలు చెబుతున్నాయి.
వేడిగాలులకు కారణాలు
హీట్ డోమ్‌లు ( ఉష్ణరక్షణ పై కప్పులు): వాతావరణంలో అధిక పీడన ప్రాంతం ఒకేచోట స్థిరంగా ఉండిపోయి, వేడి గాలిని కిందకు నెట్టివేయడం వల్ల ఈ దృగ్విషయం ఏర్పడుతుంది. ఇది చాలా రోజుల పాటు తీవ్రమైన ఉష్ణోగ్రతలను కొనసాగించేలా చేస్తుంది.
వాతావరణ మార్పు, శిలాజ ఇంధనాల వాడకం వల్ల పెరుగుతున్న గ్రీన్‌హౌస్ వాయువులు యూరప్ ఖండాన్ని ప్రపంచంలోనే వేగంగా వేడెక్కుతున్న ప్రాంతంగా మార్చాయి. గత యాభై ఏళ్లలో యూరప్ సగటు ఉష్ణోగ్రత దాదాపు 2 డిగ్రీలు పెరిగిందని ప్రపంచ వాతావరణ సంస్థ నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ సగటు కంటే యూరప్ రెట్టింపు వేగంతో వేడెక్కుతోందని పరిశోధనలు సూచిస్తున్నాయి.
సముద్ర జలాల ఉష్ణోగ్రత పెరుగుదల, ఎల్ నినో ప్రభావం: రికార్డు స్థాయి సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు, ఎల్ నినో పరిణామాలు వాతావరణంలో తేమను పెంచి, తీవ్రమైన వాతావరణ మార్పులకు ఆజ్యం పోస్తున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
పట్టణ వేడి ద్వీప ప్రభావం: నగరాల్లో కాంక్రీట్ నిర్మాణాలు, పాత భవనాలు వేడిని ఎక్కువగా పీల్చుకుని నిల్వ చేయడం వల్ల పట్టణ ప్రాంతాల్లో ఉష్ణోగ్రత మరింత పెరుగుతోంది.
పరిణామాలు – ఏయే రంగాలపై ప్రభావం
ఆరోగ్యం: వృద్ధులు, చిన్నారులు, ముందుగా ఆరోగ్య సమస్యలున్నవారు అత్యధికంగా ప్రభావితమవుతున్నారు. వడదెబ్బ, డీహైడ్రేషన్‌తో మరణాల సంఖ్య పెరుగుతోంది.
విద్యా వ్యవస్థ: నెదర్లాండ్స్ సహా పలు దేశాల్లో పాఠశాలలను మూసివేశారు.
రవాణా, విద్యుత్ వ్యవస్థలు: అధిక ఉష్ణోగ్రతల వల్ల రైలు పట్టాలు వ్యాకోచించి రవాణాకు అంతరాయం కలిగింది. విద్యుత్ డిమాండ్ పెరిగి, జర్మనీలో విద్యుత్ ధరలు పెరిగాయి.
వ్యవసాయం, కరవు, కార్చిచ్చులు: స్పెయిన్, ఫ్రాన్స్‌లలో కరవు పరిస్థితులు తీవ్రమై కార్చిచ్చుల ముప్పు పెరిగింది.
ఆర్థిక వ్యవస్థ: శ్రామిక ఉత్పాదకత తగ్గడం, శక్తి పేదరికం పెరగడం వంటి దీర్ఘకాలిక ఆర్థిక ప్రభావాలు కనిపిస్తున్నాయి.
ముందున్న ప్రమాదం
వాతావరణ నిపుణుల అంచనా ప్రకారం, ఇప్పటికే యూరప్ రెండు తీవ్రమైన వేడిగాలులను ఎదుర్కొంది. మూడో వేడిగాలి కూడా త్వరలో రానుందని అంచనాలు ఉన్నాయి. వాతావరణ మార్పు కొనసాగుతున్నంత కాలం ఇలాంటి తీవ్రమైన, తరచుగా వచ్చే వేడిగాలులు కొత్త సాధారణంగా మారే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
జాగ్రత్తలు
అధికారులు ప్రజలను మధ్యాహ్నం 11 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య ఎండలో బయటకు వెళ్లొద్దని, ఎక్కువ నీరు తాగాలని, వృద్ధులను, పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని సూచిస్తున్నారు. స్థానిక వాతావరణ శాఖల హెచ్చరికలను అనుసరించడం చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. యూరప్ దేశాల్లో ప్రస్తుతం ఎక్కడ చూసిన అత్యధిక ఉష్ణోగ్రతలతో అక్కడికి పోతున్న తీవ్ర దృశ్యాలు కనిపిస్తున్నాయి. వృద్ధులు పిల్లలు నీటి వనరుల దగ్గర గుమికూడి పోతున్నారు. రోడ్లు, నేల పగుళ్లు తీస్తున్నాయి. కార్ల టైర్లు, సిగ్నల్ లైట్లు కరిగిపోతున్నాయి. సూటు బూటు, టోపీ, టైతో ఒళ్ళు కప్పుకోవాల్సిన తెల్లవారి శరీరాలు, ఒంటిమీద గుడ్డ ఉంటేనే ఒళ్ళు మండే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఫ్యాషన్ రాజధాని ఫ్రాన్స్ లో పుట్టు బట్టలతో సరిపెట్టుకుంటున్నారు. వేడిని తట్టుకోలేక వేల సంఖ్యలో సంభవిస్తున్న మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. చైనాలో భవనాలపై నుంచి నీటిని వెదజల్లే నీటి ఆవిరి(వాటర్ మిస్ట్) పరికరాలను ఇప్పటికే వాడటం ప్రారంభించారు. ఇందువల్ల ఆ పరిసరాల్లో ఐదు నుంచి 8° ఉష్ణోగ్రత తగ్గించవచ్చు అని వారు చెబుతున్నారు. ఈ విపత్తు భారతదేశానికి కూడా విస్తరించే అవకాశాలు ఉన్నట్టు అంచనాలు వేస్తున్నారు.