జనరల్ డెస్క్ : ఆగస్టు,24( తెలుగు న్యూస్ పవర్. కామ్)
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ముగ్గురు తెలుగు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. రాష్ట్రంలోని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం చనుమల్లుపేట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కౌలూరి రాజేష్, అండమాన్ నికోబార్ దీవుల్లోని మాయాబందర్ పీఎంశ్రీ జీఎంఎస్‌ఎస్‌ఎస్ పాఠశాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్(ఆంగ్లము)గా పనిచేస్తున్న తెలుగు వ్యక్తి జెల్లి ప్రకాశ్‌రావు, తెలంగాణలోని కామారెడ్డి జిల్లా గాంధారికి చెందిన ప్రధానోపాధ్యాయురాలు బొంపెల్లి భవానిలు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఏటా సెప్టెంబర్ 5న నిర్వహించే గురుపూజోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర విద్యాశాఖ శుక్రవారం దేశవ్యాప్తంగా 48 మంది ఉపాధ్యాయులను ఈ పురష్కారానికి ఎంపిక చేసింది.
కృతిమ మేధ(ఏఐ) సాయంతో విద్యార్థులు వివిధ పోటీ పరీక్షలలో సీట్లు సాధించేందుకు రాజేష్ ప్రత్యేక మెటీరియల్‌ను తయారు చేశారు. పాఠ్యపుస్తక రచయితగా, ఎన్సీఈఆర్టీ జాతీయ రిసోర్స్ పర్సన్‌గా వ్యవహరించారు. ఆయన రూపొందించిన బోధనా విధానాలు ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది ఉపాధ్యాయులకు చేరువయ్యాయి. ఈయన ఐసీటీ టూల్స్‌పై మూడు జాతీయ వెబినార్లు నిర్వహించారు. ఉపాధ్యాయుల కోసం పాఠ్య ప్రణాళికలు, ఇంటరాక్టివ్ యాక్టివిటీస్‌కు సంబంధించిన మొబైల్ యాప్‌ను రూపొందించి అభివృద్ధి చేశారు. దేశమంతటా ఉపాధ్యాయుల కోసం ఆన్లైన్ కోర్సులను అభివృద్ధి చేయడానికి ఎంపికయ్యారు. బోధనలో సాంకేతికతను జోడించి, క్షేత్రస్థాయిలో ఫలితాలు సాధించడమే ఈ పురస్కారానికి ప్రధాన కారణమని రాజేష్ పేర్కొన్నారు.
జెల్లి ప్రకాశ్‌రావు స్వస్థలం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు. తండ్రి ఉపాధ్యాయ ఉద్యోగం కోసం అండమాన్‌కు వెళ్లడంతో ప్రకాశ్‌రావు అక్కడే ఎంఏ బీఈడీ వరకు విద్యాభ్యాసం పూర్తిచేశారు. తర్వాత ఉపాధ్యాయ ఉద్యోగం సాధించిన ప్రకాశ్‌రావు ఇప్పుడు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుతో అండమాన్‌లో తెలుగువారి గౌరవాన్ని ఇనుమడింపజేశారు. ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఇప్పటివరకూ 7 జిల్లా, రాష్ట్రస్థాయి అవార్డులు కూడా పొందారు. తాను పనిచేస్తున్న మారుమూల ప్రాంతంలోని పాఠశాలలో సరైన సౌకర్యాలు లేకపోయినా పిల్లలకు నగరాల్లో దొరికే అన్ని రకాల సౌకర్యాలనూ అందుబాటులోకి తెచ్చి విద్యాబుద్ధులు నేర్పుతున్నందుకు కేంద్ర ప్రభుత్వం ఆయన్ను ఈ అవార్డుకు ఎంపికచేసింది. ఉచిత విద్యను అందిస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్చేలా తల్లిదండ్రులను ప్రోత్సహించేందుకు 2019లో అండమాన్ రిపబ్లిక్‌డే పెరేడ్లో విద్యాశాఖ శకటాన్ని తొలిసారి ప్రదర్శించేలా చేయడంలో ముఖ్య భూమిక పోషించారు.
గాంధారి మండలానికి చెందిన భవాని 2018 సంవత్సరం నుంచి బాలికల ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తూ.. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ల ద్వారా వినూత్న రీతిలో విద్యార్థులకు కృత్యాధార బోధన చేస్తూ పేరుపొందారు. తెలంగాణ ఎస్సీఈఆర్టీ ‘ట్రయల్ బ్లేజర్స్’ పేరిట ప్రచురించిన పుస్తకంలో.. అవరోధాలను అధిగమించి ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాల సంఖ్యను పెంచారంటూ భవాని పాఠాన్ని అందులో చేర్చారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఇటీవల రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం సైతం ఆమె అందుకున్నారు. విద్యార్థులకు పోక్సో చట్టం, గుడ్ టచ్- బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించినందుకు ఇటీవల యూనిసెఫ్ జ్ఞాపిక స్వీకరించారు. అలాగే ఫిన్లాండ్ దేశంలో విద్యా వ్యవస్థ పరిశీలనకు రాష్ట్రం నుంచి ఎంపికైన 28 మంది ప్రధానోపాధ్యాయుల్లోనూ భవానికి చోటు దక్కింది.
ముగ్గురు తెలుగు వారికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు.
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికైన తెలుగు వారు