Skip to main content

Telugu News Power

హంతకున్ని పట్టిచ్చిన విరిగిన కాలు. ఉప్పుటేరు కిక్కిస పొదల నుంచి ముంబై కి లింకు.

కేసు వివరాలు తెలుపుతున్న ఆకివీడు పోలీసులు

ఆకివీడు: ఆగస్టు,25( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన గుర్తుతెలియని మహిళ హత్య కేసును పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. ఆకివీడు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ డి. విశ్వనాథ్ ఈ కేసు వివరాలను వెల్లడించారు.ఘటన నేపథ్యం, కేసు నమోదు గురించి పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
ఈ నెల 15న, ఉదయం ఉప్పుటేరు బ్రిడ్జ్–మందపాడు మార్గంలోని కిక్కిస పొదల్లో తీవ్ర గాయాలతో పడి ఉన్న సుమారు 38–45 సంవత్సరాల వయస్సు గల గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని గుర్తించారు. దీనిపై ఆకివీడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
శాస్త్రీయ దర్యాప్తు తో మృతురాలి గుర్తించారు.
జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, ఆదేశాల మేరకు క్లూస్ టీమ్ ద్వారా వేలిముద్రలు, కంట్రోల్ ఎర్త్ సేకరించి, డాగ్ స్క్వాడ్‌తో ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. దర్యాప్తు నిమిత్తం 6 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.పరిసర ప్రాంతాల సీసీటీవీ ఫుటేజీలు, మిస్సింగ్ కేసుల సమాచారం, పోస్టర్ల ప్రచారం, ఇంటింటికి వెళ్లి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో మృతురాలి ఎడమ కాలికి అమర్చిన సర్జికల్ స్టీల్ రాడ్ స్క్రూపై ఉన్న నంబర్ కీలక ఆధారంగా మారింది. సదరు నంబర్ ఆధారంగా, ముంబైకి చెందిన తయారీదారు ‘దాల్వి అండ్ సన్స్ కంపెనీని సంప్రదించారు. వారు దానిని హైదరాబాద్‌లోని సుశీల హాస్పిటల్‌కు సరఫరా చేసినట్లు తేలింది. ఆసుపత్రి రికార్డులను పరిశీలించగా, ఉప్పాడ దేవి అనే మహిళకు12.01.2023న శస్త్రచికిత్స చేసినట్లు నిర్ధారించారు. మృతురాలు ఉప్పాడ దేవిగా శాస్త్రీయంగా రుజువైంది. నిందితుడి అరెస్ట్, నేర కారణాలు పోలీసులు వెల్లడించారు. మృతురాలి భర్త ఉప్పాడ నారాయణరావు (54), ఇతని తండ్రి సోము. సాయి వంశీ కృష్ణ అపార్ట్‌మెంట్, వంశీ కృష్ణ నగర్, భీమవరం టూ టౌన్ అను వ్యక్తిని ఈ నెల 23న రాత్రి ఆకివీడు పోలీస్ స్టేషన్ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. భార్య తనను నిరంతరం అనుమానిస్తూ, గొడవపడటం, కుటుంబ సభ్యులను అసభ్యకరంగా దూషించడం, శారీరకంగా దూరం పెట్టడం వంటి కారణాలతో తీవ్ర ఆగ్రహానికి లోనై ఆమెను హత్య చేసినట్లు వెల్లడించాడు. అనంతరం సాక్ష్యాధారాలు లేకుండా చేసేందుకు మృతదేహాన్ని తన తెలుపు రంగు మారుతి సెలెరియో కారు (ఏపీ 37 సీఎల్ 1499)లో తరలించి, ఉప్పుటేరు–మందపాడు మార్గంలోని పొదల్లో పడేసినట్లు ఒప్పుకున్నాడు. నేరానికి ఉపయోగించిన కారును పోలీసులు సీజ్ చేశారు. ఈ కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసినందుకు పోలీస్ అధికారులకు అభినందనలు అందుకున్నారు.
క్లిష్టమైన ఈ అంధకార హత్య కేసును కేవలం సర్జికల్ ఇంప్లాంట్ ఆధారంగా శాస్త్రీయ పద్ధతిలో ఛేదించిన భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు, ఆకివీడు సీఐ జి. కాళీ చరణ్, ఆకివీడు ఎస్ఐ కె. శుభశేఖర్, కాళ్ళ ఎస్ఐ ఎ. గణేశ్ కుమార్, ఉండి ఎస్ఐ హెచ్. మల్లికార్జున రావులతో పాటు సిబ్బంది విజయ్, వాసు, శివ, రత్నం, మహేశ్, ఉమామహేష్, సురేశ్, మల్లికార్జున రావు, కాశీ విశ్వనాథ్ మరియు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సిబ్బందిని అదనపు ఎస్పీ డి. విశ్వనాథ్ ప్రత్యేకంగా అభినందించి, ప్రశంసించారు.