
యలమంచిలి:డిసెంబర్,15 (తెలుగు న్యూస్ పవర్) భీమవరం సమీపంలో జక్రం రిసార్ట్స్లో శనివారం ప్రారంభమైన ‘స్నేహపీడనం’ సుమారు 24 గంటల పాటు కొనసాగి, నిమిషానికి 60 నవ్వుల వేగంతో యలమంచిలి మండలం, చించినాడ వశిష్ట గోదావరి వంతెనతాకి, సమీపములో సంతోషాల అల్లకల్లోలం సృష్టించి, దాదాపు సాయంత్రం వరకు కొనసాగి, తీరం దాటింది. ఈ స్నేహ తుఫానుకు “అమేజింగ్ రీ యూనియన్” గా నామకరణం చేశారు. సుమారు దశాబ్దం తర్వాత పాలకొల్లు శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాలలో 1979 నుంచి 1982 వరకు చదివిన పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక శని, ఆదివారాల్లో జరిగింది. ఈ సందర్భంగా ఉప్పెనలా,గుప్పుమన్న స్నేహ పరిమళాల సుగందాలతో పరవశించి, వివశులయ్యారు. ఈ సందర్భంగా,ఎంత తవ్వినా అంతుచిక్కని జ్ఞాపకాల బంగారు గని తొలిచే ప్రయత్నం లో మిత్రులు నిమగ్నమయ్యారు. వారి అనుభవాలను, అనుభూతులను పరస్పరం పంచుకున్నారు. గోదావరి ఒడిలో అలలపై పడవలో తెలియాలి ఆడుతూ, ఐదు తలల తాటి చెట్టు వరకు వెళ్లివచ్చి, ఆనందించారు. మనసు నిండా ఆహ్లాదం. కడుపునిండా పసందైన విందు భోజనం అందరికీ సంతృప్తి కలిగించింది. కొందరు మిత్రులు కాస్త తీర్థం పుచ్చుకున్నాక, మాట మంతి, మాట విరుపులు, పంచులు,జోకుల పటాసులు ప్రేలాయి.మిత్రులందరూ సోమవారం ఇంటికి చేరేవరకు ఈ సరదాలు సాగాయి. అంచనాలకు మించి వచ్చిన, స్నేహితులందరికీ ఏర్పాట్లు చక్కగా చేశారు. ఈ తీయటి జ్ఞాపకాలు, స్నేహ సంక్రాంతికి స్వాగతం పలికాయి. మిత్రుల కోసం ఎంతో శ్రమించి, ప్రతి చిన్న విషయంలో కూడా ఎంతో జాగ్రత్త తీసుకుని మరపురాని, చరిత్ర సృష్టించిన, జంపన రవి, రేపాక కిరణ్, పిల్ల బాలాజీ, అన్నం వెంకటేశ్వరరావు తదితరులను మిత్రులను అభినందనలతో ముంచెత్తారు. కొద్దిరోజుల్లో ముగియనున్న ఈ ఏడాది చివరి అంకంలో చక్కటి జ్ఞాపకాన్ని పదిలం చేసుకుని, తనతో తీసుకుపోతున్నందుకు ఒకింత గర్వంతో, రాబోయే కాలం వైపు చూస్తూ,వెళ్ళిపోతూ ఉంది, ఇక గతంలా మిగిలిపోయే డిసెంబర్ నెల.