Telugu News Power

అమెరికాలో ప్రమాదం పాలకొల్లులో విషాదం

మరణించిన కృష్ణ కిషోర్,ఆశ కన్నా దంపతులు

పాలకొల్లు: జనవరి,5(తెలుగు న్యూస్ పవర్) స్థానిక, ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన కొటికలపూడి రాజమోహన్రావు కుటుంబ సభ్యులు, కిన్నెర కూల్ డ్రింక్స్ అధినేత తాతాజీ కుమారుడు, కృష్ణ కిషోర్ (51) (టిన్ను), కోడలు ఆశ కన్నా అమెరికాలోని, వాషింగ్టన్ నగరంలో ఆదివారం జరిగిన కారు ప్రమాదంలో మరణించినట్టు సమాచారం వచ్చింది. ఈ దంపతులు, తమ సంతానం శివాని, సుచయ్ కలిసి కారులో ప్రయాణిస్తుండగా, ట్రక్ ఢీ కొట్టడం వల్ల ఈ ఘోర ప్రమాదం జరిగినట్టు తెలియవచ్చింది. ప్రమాదంలో దంపతులు చనిపోగా, వారి సంతానానికి గాయాలయ్యాయి. సర్జరీ తర్వాత వారు కోలుకున్నట్టు, వారికి ప్రాణాపాయ పరిస్థితి లేదని, అక్కడ వైద్యులు తెలిపినట్టు కుటుంబ వర్గాల ద్వారా విశ్వసనీయ సమాచారం.

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వెల్స్ ఫార్గో అనే కంపెనీలో వీరు పనిచేస్తున్నారు. ఈ కంపెనీ 35 దేశాలకు విస్తరించి ఉన్న బహుళ జాతి సంస్థ. దాదాపు 7 కోట్ల మంది ఖాతాదారులకు సేవలు అందిస్తున్న కంపెనీ. కృష్ణ ఈ కంపెనీలో చాలా కాలంగా పనిచేస్తున్న, భార్య ఆశ కన్నా కూడా ఇటీవలే,ఇదే కంపెనీలో పని చేస్తున్నారు. వీరికి గ్రీన్ కార్డు ఉంది. అమెరికా నుంచి భారతదేశానికి తీసుకురావడానికి ఉన్న అనేక అవరోధాలు, సమయం వంటి అనివార్య కారణాలవల్ల ఆ దంపతులను భారతదేశానికి తీసుకురాకపోవచ్చునని అభిప్రాయపడుతున్నారు. మాతృభూమికి, 10 రోజుల కింద రావడం,వారి అనుభూతులు, జ్ఞాపకాల్లోకి చేరకుండానే, దంపతులు అంతర్దానమవడం స్థానిక బంధుమిత్రులకు దిగ్భ్రాంతికర విషాదాన్ని మిగిల్చింది. పట్టణంలో ఏ నలుగురు కలిసినా ఇదే విషయం చర్చించుకోవడం కనిపించింది. పచ్చని కాపురంలో, చిచ్చు పెట్టిన ఈ ప్రమాదం, ఇద్దరు బిడ్డలను తల్లిదండ్రులకు దూరం చేసింది. వీరి గురించి తెలిసిన వారందరూ తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.