Telugu News Power

పోరాట యోధుడు దొమ్మేటి వెంకటరెడ్డి. -మంత్రి నిమ్మల

వెంకట రెడ్డికి నివాళులర్పిస్తున్న మంత్రి నిమ్మల తదితరులు
జయంతి సందర్భంగా పేదలకు దుప్పట్లు పంచి పెడుతున్న దృశ్యం

పాలకొల్లు: మార్చి, 23(తెలుగు న్యూస్ పవర్. కామ్)
భారతదేశ స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కోసం, బానిస సంకెళ్ల నుంచి విముక్తి కలగజేయటానికి పోరాడిన యోధుడు దొమ్మేటి వెంకటరెడ్డని, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు కీర్తించారు. కూటమి ప్రభుత్వం వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన తొలిసారి, పాలకొల్లు లో, సోమవారం జరిగిన జయంతి ఉత్సవాల్లో వెంకట రెడ్డికి మంత్రి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, స్వాతంత్ర ఉద్యమ కాలంలో, తన సొంత సైన్యాన్ని తయారు చేసుకుని బ్రిటిష్ వారితో పోరాడిన ఉద్యమకారుడని కొనియాడారు. నాడు తన శెట్టిబలిజ కులస్తుల ప్రగతి కోసం తపించి, దిశానిర్దేశం చేసిన దార్శనికుడు దొమ్మేటని ప్రశంసించారు. మహాత్మా గాంధీ కంటే ముందే, సమ సమాజం కోసం, అంటరానితనం నిర్మూలన కోసం కృషి చేశారన్నారు. కరువు కాటకాలలో, కష్టాల్లో ఉన్న శెట్టిబలిజ కులస్తుల జీవితాన్ని బాగు చేయటానికి, చదువు ఒక్కటే మార్గమని భావించి వయోజన విద్యను ఆనాడే ఉద్యమంగా ప్రజల్లోకి తీసుకువెళ్లారని తెలిపారు. వెంకటరెడ్డి జయంతి రాష్ట్ర పండుగగా ప్రకటించడం, దేశానికే గౌరవం అన్నారు. కూటమి ప్రభుత్వం వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఎంతటి ప్రాధాన్యత ఇస్తుందో, తెలియజేయడానికి ఇది ఒక నిదర్శనం అన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, యువగళం పాదయాత్రలో యలమంచిలి మండలం చించినాడలో, కోనసీమ జిల్లాలో సత్తుపల్లి సోదరులకు ఇచ్చిన హామీ మేరకు, నేడు ప్రభుత్వం జయంతిని అధికారికంగా ప్రకటించి, ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. వెంకటరెడ్డి ఆయన ఆశయ సాధన కోసం, భావితరాలకు స్ఫూర్తిని ఇవ్వటానికి కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా, మాజీ ఎమ్మెల్సీ, అంగర రామ్మోహన్ రావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కోడి విజయభాస్కర్, తెలుగుదేశం పార్టీ నాయకులు పెచ్చెట్టి బాబు, గండేటి వెంకటేశ్వరరావు, మామిడిశెట్టీ పెద్దిరాజు, కడలి గోపాలరావు తదితర పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వ పండుగగా ప్రకటించడం పట్ల వారు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. మంత్రి కేక్ కటింగ్ చేసి నాయకులకు స్వయంగా తినిపించారు. తొలి జయంతి కార్యక్రమంలో పలువురు ఉత్సాహంగా పాల్గొని, హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పేదలకు దుప్పట్లు పంచిపెట్టారు.