Telugu News Power

ఆధునిక మహిళ చరిత్రను తిరగరాయాలి. -ఆచార్య విస్తాలి శంకరావు పిలుపు.

ఆచార్య శంకరరావును సత్కరిస్తున్న దృశ్యం

పాలకొల్లు: మార్చి, 24,(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆధునిక మహిళ చరిత్రను తిరగరాయాలని, మద్రాస్ యూనివర్సిటీ, చెన్నై, తెలుగు శాఖ, అధ్యక్షులు ఆచార్య విస్తాలి శంకరరావు పిలుపునిచ్చారు. స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి, ప్రభుత్వ కళాశాలలో మంగళవారం,నిర్వహించిన “తెలుగు సాహిత్యం-మహిళా చైతన్యం’, జాతీయ సదస్సులో వారు కీలకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా, మహాకవి గురజాడ ఆకాంక్ష, ఆధునిక మహిళ చరిత్ర తిరగరాస్తుందన్న అంశాన్ని సమగ్రంగా విశ్లేషించి విసిదీకరించారు. ఈ ఆధునిక కాలంలో కూడా స్త్రీకి సమాజంలో నిజమైన సమానత్వం ఇప్పటికి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి, మహిళల ఈ పరిస్థితి కూడా సుదీర్ఘకాలం, ఎందరో చేసిన త్యాగఫలంగా అభివర్ణించారు. అనాదిగా స్త్రీని తమ రచనల్లో అంతంత మాత్రం గానే సృజించారన్నారు. అది కూడా అలంకారప్రాయంగా, అవసరానికి మాత్రమే రచించారన్నారు. రామాయణ కాలం నుంచి, రాముని దగ్గర నుంచి మహిళ లు ను సోదరిని కంటే తక్కువ చేసి చూపారని, ఊర్మిళను నిద్రపుచ్చి ఉంచారని ఆనాటి కవులకు మహిళల పట్ల ఉన్న భావాన్ని తప్పు పట్టారు. ప్రాచీన కాలంలో మహిళా కవియిత్రులకు కూడా మహిళలను అదే దృష్టితో తమ రచనల్లో వ్యక్తీకరించారన్నారు. ఆధునిక కాలంలో, రచయిత్రులు, దళితల రచయిత్రలు తమకు మనుషులుగా, సమానత్వం కావాలని తమ రచనల ద్వారా బాహ్య ప్రపంచంలోకి వచ్చి ఉద్యమిస్తున్నారని పేర్కొన్నారు. విద్యార్థినుల అభ్యున్నతి కోసం ప్రిన్సిపల్ రాజరాజేశ్వరి చేస్తున్న కృషిని ఆచార్య విస్తాలి శంకరరావు ప్రశంసించారు. ప్రభుత్వ కాలేజీల్లో ఇలాంటి అధ్యాపకులు కూడా ఉంటారా అన్నట్టుగా, పనిచేసే, ప్రపంచ స్థాయి వరకు నిర్వహించే అనేక సదస్సులో పాల్గొన్న అనుభవంగల కళాశాల తెలుగు శాఖ ప్రధాన ఆచార్యులు బూసి వెంకటస్వామి, తనకు గత 28 ఏళ్లగా తెలిసి ఉండటం గర్వకారణం అన్నారు. కళాశాలలో అధ్యాపక బృందం ఐకమత్యంతో, బృందస్ఫూర్తితో కృషిచేసి ఈ సదస్సును దిగ్విజయం చేసినందుకు అభినందనలు తెలియజేశారు. ఈ కళాశాలలో జాతీయస్థాయి సదస్సులు గతంలో నాలుగు నిర్వహించామని ప్రిన్సిపల్ తిరువీధుల రాజరాజేశ్వరి తెలిపారు. ఈ సదస్సు కూడా అతి తక్కువ సమయంలో, జాతీయస్థాయిలో నిర్వహించినందుకు ప్రిన్సిపల్ అధ్యాపక బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రిన్సిపల్ గా తన ఆధ్వర్యంలో జాతీయ సదస్సు జరిగినందుకు సంతోషం వ్యక్తం చేశారు. సమాజంలో మహిళల పాత్ర విశిష్టమైనదన్నారు. వారి భావ వ్యక్తీకరణ సమాజ ప్రగతికి ఎంతగానో తోడ్పడిందన్నారు. విద్యార్థినులు, సాహిత్య అధ్యయనంతో సమాజంలో సమాన స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.ఈ సదస్సుకు ముఖ్య వక్తలుగా మద్రాస్ విశ్వవిద్యాలయం, చెన్నైకు చెందిన ఆచార్య విస్తాలి శంకర్రావు, కేంద్రీయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌కు చెందిన ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు కీలక ఉపన్యాసం చేశారు. ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు సాంకేతిక సదస్సులోపాల్గొని,మాట్లాడుతూ మహిళా చైతన్యం అనేది కేవలం ఆధునిక కాలానికే పరిమితం కాలేదని, ప్రాచీన సాహిత్యం నుండి నేటి వరకు వివిధ రూపాల్లో కొనసాగుతోందని వివరించారు. ముఖ్యంగా దళిత మరియు అణగారిన వర్గాల మహిళలు తమ సాహిత్యం ద్వారా సామాజిక వివక్షను ఎలా ఎదుర్కొంటున్నారో ఆయన విశ్లేషించారు.
విద్యార్థులు సాహిత్యాన్ని కేవలం పరీక్షల కోసమే కాకుండా, సమాజంలోని స్త్రీల స్థితిగతులను అర్థం చేసుకోవడానికి ఒక సాధనంగా ఉపయోగించుకోవాలని సూచించారు. కీలక ఉపన్యాసం చేసిన వక్తలు తమ విశేషమైన అనుభవంతో, విశిష్టమైన విశ్లేషణతో అలవోకగా మాట్లాడుతూ, తమ లోతైన విశ్లేషణా ఝరిలో తడిసి ముద్దయిన సభికులు పరవశంతో వివశులయ్యారు. కళాశాల తెలుగు శాఖ అధ్యక్షులు, డాక్టర్ బూసి వెంకటస్వామి, అతి తక్కువ సమయంలో, తమ అధ్యాపకు బృందాన్ని కలుపుకొని అత్యంత సమర్థవంతంగా సదస్సును విజయవంతం చేసినందుకు, ప్రతినిధులు ప్రశంసించారు. ఈ సందర్భంగా వెంకటస్వామి దంపతులను ఘనంగా సత్కరించారు. ప్రతినిధులు విశేషంగా ఈ సదస్సుకు ప్రత్యక్ష పద్ధతిలో హాజరైయ్యారు. ఈ జాతీయ సదస్సు ప్రత్యేక సంచికను విడుదల చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకులు ఉత్సాహంగా పాల్గొని సదస్సును విజయవంతం చేశారు. తెలుగు సాహిత్యంలో మహిళల పాత్రను వెలికితీయడంలో ఇటువంటి సదస్సులు ఎంతో ఉపయోగకరమని వక్తలు అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో కళాశాల పూర్వ విద్యార్థి మరియు ఆంధ్ర విశ్వవిద్యాలయం రిటైర్డ్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ ఆచార్య ఏ. నాగేశ్వరరావు,కళాశాల పూర్వ విద్యార్థి సంఘం ప్రెసిడెంట్ డాక్టర్ ఎస్వీ రంగారావు,జాతీయ సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ మరియు వైస్ ప్రిన్సిపల్
టి కృష్ణ, కన్వీనర్ మరియు తెలుగు విభాగాధిపతి డాక్టర్ బూసి వెంకటస్వామి,కోకన్వీనర్ డాక్టర్ ఎం రామకృష్ణ, అర్థశాస్త్ర అధ్యాపకులు డాక్టర్ సిహెచ్ ఉషారాణి,డాక్టర్ వి విజయలక్ష్మి కళాశాలకు చెందిన అధ్యాపకులు ఇతర కళాశాలల కు చెందిన అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.