Telugu News Power

మాల మహానాడు అధ్యక్షులు రాజేష్ గృహ నిర్బధం.

గృహనిర్బంధం గురించి అధ్యక్షులు రాజేష్ కు తెలియజేస్తున్న పోలీసులు.

పాలకొల్లు: మార్చి, 31(తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షులు నల్లి రాజేష్ ను పాలకొల్లు పోలీసులు మంగళవారం గృహ నిర్బంధంలో ఉంచారు. ఇటీవల ఆకివీడు మండలం పేదపేట రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా ఉపసభాపతి, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ప్రవేశించడానికి వెళ్లిన సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. భీమవరంలో జరపతల పెట్టిన రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షులు నల్లి రాజేష్ వారి అనుయాయులు వెళ్లడానికి ప్రయత్నం చేశారు. సంఘటనా స్థలానికి స్థలానికి వెళ్లడానికి కూడా సమాయత్తమయ్యారు. ఈ సందర్భంగా, స్థానిక పోలీసులు వారికి నోటీసులు అందజేశారు. పట్టణ సీఐ కోలా రజిని కుమార్, ఆధ్వర్యంలో ఎస్సై జి పృద్వి, ఏఎస్ఐ ఎస్ మార్లింగం గృహనిర్బంధ ఆదేశాలు అమలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు నల్లి రాజేష్ మాట్లాడుతూ, గెలిచినప్పుడు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి కులమాతాలకతీతంగా అందర్నీ సమానంగా చూస్తామని చెబుతారని, అధికారంలోకి వచ్చాక, ఇందుకు భిన్నంగా కుల మతాలను విడదీసి రాజకీయ పబ్బం గడుపు కుంటారని విమర్శించారు. చట్టసభలో అత్యున్నత స్థానంల్లో ఉన్నవారు కూడా బహిరంగంగా రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేయడాన్ని రాజేష్ ఖండించారు. ఇది రాజ్యాంగాన్ని అతిక్రమించినట్టుగా చూడవలసి వస్తుందన్నారు. ఇదే విధానం కొనసాగితే, రాబోయే సాధారణ ఎన్నికల్లో ఈ ప్రజా ప్రతినిధులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని రాజేష్ హెచ్చరించారు. ఈ సందర్భంగా రాజేష్ వెంట, మహానాడు రాష్ట్ర కార్యదర్శి విప్పర్తి ప్రభాకర్, జిల్లా ఉపాధ్యక్షులు సరెళ్ళ శ్రీనివాస్, సరేళ్ళ రఘు, పి కృపానాథ్, జి పెద్దిరాజు, ఇషాకు రాజు, పి వీరాస్వామి, వై చంద్రశేఖర్, ఈ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.