శ్రీలంక తెలుగు కాంగ్రెస్ ఆహ్వానం మేరకు ఆ దేశంలో పర్యటిస్తున్న అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గురువారం అనురాధపురలోని ప్రముఖ బౌద్ధ క్షేత్రం “జయశ్రీ మహాబోధి టెంపుల్” సందర్శించారు. ఈ బౌద్ధక్షేత్రం ప్రపంచంలో అత్యంత పవిత్రమైన బౌద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇక్కడ ఉన్న బోధివృక్షం భారతదేశంలోని బోధ్‌గయలో బుద్ధుడు జ్ఞానోదయం పొందిన మహాబోధి వృక్షానికి చెందిన కొమ్మ నుండి పెంచబడినదిగా బౌద్ధ సంప్రదాయం చెబుతుంది. ఈ మహావృక్షాన్ని బంగారు కడ్డీలతో సంరక్షిస్తున్నారు. క్రీ.పూ. 3వ శతాబ్దంలో చక్రవర్తి అశోకుని కుమార్తె సంఘమిత్ర థేరి ఈ బోధి కొమ్మను శ్రీలంకకు తీసుకువచ్చి, రాజు దేవానంపియ తిస్స ఆధ్వర్యంలో అనురాధపురంలోని బో మళువ ప్రాంగణంలో నాటారు. అప్పటి నుండి నిరంతరంగా పూజలు అందుకుంటున్న ప్రపంచంలోని అత్యంత ప్రాచీన చారిత్రక వృక్షంగా దీనికి విశిష్ట స్థానం ఉంది.ఈ సందర్భంగా ఆలయ పరిపాలకులు, బౌద్ధ మహాసంఘ నాయకులుగా ప్రసిద్ధులు ప్రముఖ బౌద్ధ భిక్షువులు వెన్.పల్లెగామా హేమరతన నాయక థియరో గారు, వెన్.కహతగొల్లావే మేధంకర థియరోని బుద్ధప్రసాద్ బృందం కలుసుకుని ఆశీస్సులు తీసుకున్నారు. అమరావతి శిల్పాల ప్రతిమలతో కూడిన పెడన కలంకారి వస్త్రాన్ని బుద్ధప్రసాద్ బహుకరించి అమరావతి, ఘంటసాల స్థూపాల విశిష్టతను వారికి తెలియజేశారు.
రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ విశ్రాంత డైరెక్టర్ డాక్టర్ డీ.విజయభాస్కర్ మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా సింగుపురం నుంచి వెళ్లిన విజయబాహుడు తన తల్లి సింహళ పేరు మీద సింహళ సామ్రాజ్యాన్ని స్దాపించినట్లు బౌద్ద గురువులకు చెప్పారు. విజయ బాహుడు 38 సంవత్సరాల పాటు సింహళాన్ని పాలించినట్లు తెలిపారు. అతనికి వారసులు లేనందున మళ్ళీ ఈ సింగుపురం నుంచే వెళ్లిన పాండు వాసుదేవుడు 30 సంవత్సరాలు, అతని కుమారుడు అభయ్ 20 సంవత్సరాలు, ఆ తరువాత అతని కుమారుడు ముతశివ 60ఏళ్లు, అతని కుమారుడు దేవానాం ప్రియతిస్సా 40 ఏళ్లు ఇలా దాదాపు 200 సంవత్సరాల పాటు సింహళాన్ని శ్రీకాకుళం జిల్లా సింగుపురం వారు పరిపాలించినట్లు తెలిపారు. వీరిలో దేవానాం ప్రియతిస్సా పట్టాభిషేకం సమయంలో అశోకుని కుమారుడు మహీంద్ర సింహాళానికి బౌద్ధ ధర్మ మాధుర్యాన్ని పరిచయం చేశారని వివరించారు. తిస్సా భార్య అనులకు దీక్షనివ్వడానికి అశోకుని కుమార్తె సంఘమిత్ర సింహళానికి వెళ్లినట్లు తెలిపారు.
అనంతరం బంగారు కడ్డీలతో సంరక్షిస్తున్న బోధి వృక్షాన్ని బుద్ధప్రసాద్ సందర్శించారు. కార్యక్రమంలో సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ-హైదరాబాద్ ఉప కులపతి వెలుదండ నిత్యానందరావు, యూనివర్సిటీ రిజిస్ట్రార్ కోట్ల హనుమంతరావు, డీపీ అనురాధ , చామర్తి మురళీ ఉన్నారు.
శ్రీలంకలో జయశ్రీ మహాబోధి టెంపుల్ సందర్శించిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్.
శ్రీలంక బౌద్ధ క్షేత్రం వద్ద మండలి బృందం