Telugu News Power

నేను రాను నరసాపురానికి, అరుణాచలానికి ఆగిన రైలు కూత.

విజయవాడ:మార్భి, 31(తెలుగు న్యూస్ పవర్. కామ్) కొండనాలుకకు మందేస్తే, ఉన్న నాలుక వూడిన చందంగా తయారయింది అరుణాచలం రైలు ప్రయాణం. గత కొంతకాలంగా భక్తులు విశేషంగా దర్శిస్తున్న, అరుణాచలం యాత్రకు పచ్చ సిగ్నల్ లేక ఆగిపోయింది. నరసాపురం నుంచి బయలుదేరే ఈ రైలు ప్రయాణం తిరువణ్నమలై వరకు సాగుతుంది. భక్తులకు ఈ ప్రయాణం ఎంతో సౌకర్యవంతంగా ఉండటం వల్ల, పలు జిల్లాల భక్తులు రిజర్వేషన్ కోసం పోటీ పడుతున్నారు. ఏడాదిన్నరగా, రెండు నెలలకు ఒకసారి రైల్వే అధికారులు ఈ రైలు ప్రయాణానికి అనుమతి పొడిగిస్తూ వస్తున్నారు. కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రి, భూపతి రాజు శ్రీనివాస వర్మ స్థానిక ఎంపీ, ఈ రైలు శాశ్వత ప్రాతిపదికన నడుపుతామని నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు. కొన్ని రైళ్లు తాడేపల్లిగూడెం వంటి ప్రధాన స్టేషన్లో హాల్ట్ కూడా ప్రకటించారు. అయితే అవేవీ ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. పైగా అరుణాచలం కి ఉన్న ఒక్క రైలు కూడా ముఖం చాటేసి, నేను రాను నరసాపురానికి పొమ్మంటుంది. ప్రయాణికులకు దిక్కుతోచడిని పరిస్థితి ఎదురయింది. ఎంపీ సొంత నియోజకవర్గం సంబంధించిన అంశాలపై రైల్వే అధికారులతో ఈటీవీలో పోలుమార్లు చర్చించి వారి దృష్టికి తీసుకువచ్చారు. అయినప్పటికీ, ప్రయోజనం లేకుండా పోయింది. ప్రయాణికులు, ముఖ్యంగా అరుణాచలం వెళ్లే భక్తులకు ఈ రైలు రద్దు చేయడం వల్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి తన ప్రతిభతో,పరపతితో వెంటనే పునరుద్ధరించాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.