
పాలకొల్లు: ఏప్రిల్, 1(తెలుగు న్యూస్ పవర్. కామ్) అభివృద్ధి, సంక్షేమ కూటమి ప్రభుత్వానికి రెండు కళ్ళు వంటివని, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. చేనేతకు ఉచిత విద్యుత్తు పథకం ప్రారంభోత్సవం సందర్భంగా స్థానిక భగ్గేశ్వరంలో బుధవారం ప్రారంభించిన సందర్భంగా మంత్రి మాట్లాడారు, కూటమి ప్రభుత్వం బీసీలకు, ముఖ్యంగా చేనేతకారులకు అండదండలు అందిస్తుందని నిమ్మల తెలిపారు. చేనేత మగ్గం ఉన్న 93 వేల మందికి నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందిస్తామన్నారు. వీరికి ఏడాదికి 8,640 రూపాయల విద్యుత్తు ఉచితంగా లభిస్తుంది అన్నారు. పవర్లూమ్ ఉన్న 12 వేల మందికి నెలకు 500 యూనిట్ల చొప్పున, ఏడాదికి 21 వేల రూపాయల ఉచిత విద్యుత్తు అందిస్తున్నామన్నారు. ప్రభుత్వానికి ఈ పథకం వల్ల ఏటా 150 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని మంత్రి వెల్లడించారు. గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో 11 సార్లు విద్యుత్ ధరలు పెంచిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత గత ప్రభుత్వం ట్రూ అప్ చార్జీల రూపంలో వినియోగదారులపై మోపిన భారాన్ని తగ్గిస్తూ, ట్రూ డౌన్ పద్ధతిలో ఇంతవరకు విద్యుత్ చార్జీలు పెంచలేదన్నారు. ప్రజా సంక్షేమం పట్ల కూటమి ప్రభుత్వానికి నిబద్ధతకు ఇది ఒక నిదర్శనం అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కోడి విజయభాస్కర్, బిజెపి నాయకులు ఉన్నమట్ల కపర్ది, స్థానిక నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.