Telugu News Power

అజరామరం రాజధాని అమరావతి.

లోక్ సభ సభ్యుల హర్షద్వానాల మధ్య ఆమోదం పొందిన అమరావతి బిల్లు
బిల్లు ఆమోదం పొందినట్టు ప్రకటిస్తున్న లోక్ సభ పానల్ సభాపతి తెన్నేటి కృష్ణ ప్రసాద్

న్యూఢిల్లీ/అమరావతి: ఏప్రిల్, 1 (తెలుగు న్యూస్ పవర్. కామ్)
ఆంధ్రప్రదేశ్‌కు అమరావతిని ఏకైక, శాశ్వత రాజధానిగా గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఈ దిశగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ, సవరణ బిల్లు, 2026ను బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఇది ఎన్డీయే మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ, అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీర్ఘకాల లక్ష్యానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారు.
ఈ బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లోక్‌సభలో ప్రవేశపెట్టగా, సభాధ్యక్షుడు తెన్నేటి కృష్ణ ప్రసాద్ వాయిస్ ఓటుతో ఆమోదం తెలిపారు. ఈ చట్టం అమలులోకి వస్తే, భవిష్యత్తులో అమరావతిని రాజధానిగా మార్చే ప్రయత్నాలకు పూర్తిగా అడ్డుకట్ట పడుతుంది.
ఇప్పటికే మార్చి 28న ఆంధ్రప్రదేశ్ శాసనసభ కూడా ఒక తీర్మానం ఆమోదించి, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5లో “అమరావతి” పేరును అధికారికంగా రాజధానిగా చేర్చాలని కేంద్రాన్ని కోరింది.
2014లో రాష్ట్ర విభజన అనంతరం మొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు,అమరావతిని రాజధానిగా ప్రకటించి, దాని అభివృద్ధికి భారీగా పెట్టుబడులు పెట్టారు. అయితే 2019లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోవడంతో, వైయస్ జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
తన పదవీకాలంలో జగన్ మూడు రాజధానుల విధానాన్ని ప్రకటించారు. ఆ ప్రకారం పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలును నిర్ణయించారు.
అయితే 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అమరావతినే రాష్ట్రానికి ఏకైక రాజధానిగా కొనసాగిస్తామని ప్రకటించారు.
తెలంగాణ ఏర్పాటుకు దారితీసిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో హైదరాబాద్‌ను తెలంగాణ రాజధానిగా గుర్తించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకువచ్చిన తాజా సవరణ బిల్లు అమరావతిని శాశ్వత రాజధానిగా బలపరచనుంది.
లోక్‌సభలో 16 మంది ఎంపీలతో ఉన్న టిడిపి, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి కీలక మద్దతు అందిస్తున్న విషయం తెలిసిందే.
అమరావతి శాశ్వత రాజధానిగా లోక్ సభలో బుధవారము నామకరణ మహోత్సవం జరిగిన సందర్భంగా ఆంధ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు పేరు లేని రాజధాని రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ కు ఇక ఆ నామోషి తొలగిపోయింది. నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పల్లా శ్రీనివాసరావు, కేంద్ర మంత్రులు నిమిషానికి చంద్రశేఖర్, రామ్మోహన్ నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాజధాని రైతులు తమ హర్షం వ్యక్తం చేశారు. రాజ్యసభలో నేడు ఈ బిల్లు ఆమోదం పొందనుంది. ఈ బిల్లుకు సహకరించిన కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని రాజకీయ పార్టీలకు కృతజ్ఞతలు తెలియజేయటానికి నారా లోకేష్ ఢిల్లీ చేరుకున్నారు. యధావిధిగా వైఎస్ఆర్ పార్టీ ఈ బిల్లుకు వ్యతిరేకంగా వాకౌట్ చేసింది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజధాని కి సంబంధించి కొత్త పల్లవి అందుకున్నారు. ‘మావిగన్’ రాజధాని పేరు సూచించారు. మచిలీపట్నం విజయవాడ గుంటూరుకు ప్రతీకగా ఈ రాజధాని నగరాన్ని ప్రకటించారు. మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ చెప్పినట్టుగానే, శాసనసభలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేసినట్టుగానే, తాము అధికారంలోకి వస్తే, కొత్త రాజధానికి ఏకగ్రీవ తీర్మానం చేసి రాజధాని మార్చే అవకాశం ఉందని బాంబు పేల్చారు. ఒక బిడ్డ పుట్టిన వెంటనే తల్లిదండ్రులతో ఆ బిడ్డ ఆడ మగ అని మాత్రమే పంచాయతీలో గాని మున్సిపాలిటీలో గాని జనన ధ్రువపత్రం నమోదు చేస్తారు. ఆ తర్వాత బిడ్డకు పేరు పెట్టిన తర్వాత పేరుతో సహా జనన ధృవపత్రం అందజేస్తారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కూడా ఇదే పద్ధతి లో శాశ్వత రాజధాని ధ్రువపత్రం చట్టబద్ధంగా ప్రకటించారు. ఇక అమరావతి అజరామురమై, అజయమై ప్రగతి వైపు పరుగులు తీస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ఈ బిల్లు ఆమోదం పొందుతున్నప్పుడు పానల్ సభాపతి స్థానంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ ఉండటం ఓ ప్రత్యేకత.

నాడు ప్రధాని మోడీ ఆవిష్కరించిన అమరావతి శిలాఫలకం