విజయవాడ: జూన్, 23( తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్రంలో రానున్న వ్యవసాయ సీజన్లో ఎల్నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాల నేపథ్యంలో, పశుసంపద రక్షణ, పశుపోషకుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం ముందస్తు కార్యాచరణ చేపట్టింది. వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొంటూ, పశువులకు పచ్చిమేత కొరత తలెత్తకుండా చూడాలనే లక్ష్యంతో పశుసంవర్ధక శాఖ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పశుగ్రాసాల సాగును ప్రోత్సహిస్తోంది.ఇందులో భాగంగా “ప్రీమాన్సూన్ డ్రై సోయింగ్ (పి ఎం డి ఎస్)” రుతుపవనాలకు ముందేపూడి విత్తనాలు వెదజల్లే పద్ధతి విధానం రూపొందించిన అవగాహన కరపత్రాలను మంగళవారం విజయవాడలోని మంత్రి అచ్చనాయుడు వారి కార్యాలయంలో ఆవిష్కరించారు. వాతావరణ మార్పుల ప్రభావం, వ్యవసాయంతో పాటు పశుసంపదపై కూడా పడుతున్న నేపథ్యంలో రైతులు, పశుపోషకులు పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. తక్కువ వర్షపాతం నమోదైనప్పటికీ ప్రకృతి వ్యవసాయ సాంకేతికతలను అనుసరించడం ద్వారా మెరుగైన పశుగ్రాస దిగుబడులు సాధించవచ్చు. పచ్చిమేత లభ్యత, పశుగ్రాస నిల్వ, తాగునీటి వసతులు, పశుసంరక్షణ చర్యలపై సమగ్ర సమాచారం అందించేందుకు ఈ కరపత్రాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.
గ్రామ స్థాయిలో పశుసంవర్ధక శాఖ సిబ్బంది ద్వారా రైతులు, పశుపోషకులకు ఈ కరపత్రాలను పంపిణీ చేసి విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పశుసంపద పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఎలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎదురైనా పశుపోషకులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో ముందస్తు ప్రణాళికతో వ్యవహరించడం ద్వారా పశుసంపదను సంరక్షించుకోవచ్చని, అందుకే రాష్ట్రవ్యాప్తంగా ఈ కరపత్రాలను ముద్రించి పంపిణీ చేస్తున్నామని పశుసంవర్ధక శాఖ సంచాలకులు డా. టి. దామోదర నాయుడు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పీతల సుజాత, పశుసంవర్ధక శాఖ సంచాలకులు డా. టి. దామోదర నాయుడు, శాఖ ఉన్నతాధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
పశు సంపద కోసం రైతులకు అవగాహన కార్యక్రమం. -మంత్రి అచ్చెం నాయుడు
రైతులకు అవగాహన కరపత్రం విడుదల చేస్తున్న మంత్రి అచ్చం నాయుడు