పాలకొల్లు: జూన్,26 (తెలుగు న్యూస్ పవర్.కామ్)
అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శుక్రవారం ప్రఖ్యాత హాస్య నటులు అల్లు అల్లు రామలింగయ్య విగ్రహం కూడలి వద్ద విస్తృతస్థాయిలో పోలీసుల అవగాహన సదస్సు నిర్వహించారు.యువతను, సమాజాన్ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద మహమ్మారి గంజాయి, డ్రగ్స్ మహమ్మారి అని, వీటి బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని పాలకొల్లు పట్టణ పోలీస్ మరియు ఎక్సైజ్ శాఖల అధికారులు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు పాలకొల్లు పట్టణంలోని ప్రముఖ కూడలి అయిన అల్లు బొమ్మ సెంటర్ నందు స్థానిక పోలీసులు మరియు ఎక్సైజ్ పోలీసులు సంయుక్తంగా భారీ అవగాహన సదస్సును నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాలకొల్లు పట్టణ సి.ఐ కె. రజిని కుమార్, పాలకొల్లు ఎక్సైజ్ సి.ఐ,ఎం. శ్రీనివాసరావు హాజరయ్యారు.
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: పట్టణ సి.ఐ కె. రజిని కుమార్
సదస్సులో పట్టణ సి.ఐ రజిని కుమార్ గారు మాట్లాడుతూ, ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు ప్రతి సంవత్సరం జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటామని గుర్తుచేశారు. ఈ ఏడాది (2026) “ప్రపంచ డ్రగ్స్ సమస్య: శాశ్వతమైన సవాళ్లు, కొత్త సమస్యలు,వినూత్న పరిష్కారాలు” అనే నినాదంతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. సాంకేతికతను వాడుకుంటూ సైబర్ వేదికగా సాగుతున్న డ్రగ్స్ నెట్‌వర్క్‌లను ఛేదించేందుకు పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటోందని, యువత ఇటువంటి వ్యసనాలకు దూరంగా ఉండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు.ఎక్సైజ్ సి.ఐ ఎం. శ్రీనివాసరావు మాట్లాడుతూ, మాదకద్రవ్యాల వినియోగం కేవలం ఒక వ్యక్తి ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా, ఒక పూర్తి కుటుంబ ఉనికిని, సమాజ శాంతిభద్రతలను దెబ్బతీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి, ఇతర నిషేధిత డ్రగ్స్ విక్రయాలు లేదా రవాణాపై సమాచారం తెలిస్తే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలని, సమాచారమిచ్చిన వారి వివరాలు అత్యంత రహస్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. బాధితులను నేరస్థుల్లా కాకుండా సానుభూతితో చూస్తూ, వారిని వ్యసనాల నుంచి దూరం చేసేందుకు కౌన్సిలింగ్, పునరావాస కేంద్రాల సహాయం అందించాలని పేర్కొన్నారు.
ఈ అవగాహన సదస్సులో భాగంగా అల్లు బొమ్మ సెంటర్ వద్ద పోలీసులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రజలకు, వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాలకొల్లు పట్టణ పోలీస్ సిబ్బంది, ఎక్సైజ్ శాఖ సిబ్బంది మరియు స్థానిక యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం. విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమం చేపట్టిన పోలీసు,ఎక్సైజ్ శాఖలు
మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం లో పోలీసు, ఎక్సైజ్ శాఖల అవగాహన కార్యక్రమం