Telugu News Power

గాజా చిన్నారుల విద్య కోసం రూ. 800 మిలియన్ స్వీడిష్ క్రోనర్లు విరాళం.

మహాదాత రోజర్ అకేలియస్

చరిత్రలోనే అతిపెద్ద విరాళమని యూనిసెఫ్ వెల్లడి

గాజా: జూలై,1 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ఇజ్రాయిల్ తో యుద్ధంలో తీవ్రంగా నష్టపోయిన గాజాలో చిన్నారుల విద్య పునరుద్ధరణకు స్వీడన్‌కు చెందిన బిలియనీర్ రోజర్ అకేలియస్ తన అకేలియస్ ఫౌండేషన్ ద్వారా 800 మిలియన్ స్వీడిష్ క్రోనర్లు (సుమారు 76 మిలియన్ అమెరికన్ డాలర్లు) రూ.723 కోట్లు విరాళంగా ప్రకటించారు. ఈ నిధులను యూనిసెఫ్ స్వీడన్ ద్వారా వినియోగించనున్నారు. యూనిసెఫ్ స్వీడన్ చరిత్రలో ఒకే వ్యక్తి నుంచి అందిన అతిపెద్ద విరాళం ఇదేనని సంస్థ తెలిపింది.
ఈ నిధులతో గాజాలో సుమారు 400 పాఠశాలలు, విద్యా కేంద్రాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటి ద్వారా యుద్ధ ప్రభావానికి గురైన సుమారు లక్ష మంది చిన్నారులకు విద్యతో పాటు పోషకాహారం, సురక్షితమైన అభ్యాస వాతావరణం కల్పించనున్నారు. పరిస్థితులను బట్టి తాత్కాలిక టెంట్ పాఠశాలలు లేదా శాశ్వత భవనాలను నిర్మించనున్నట్లు అకేలియస్ ఫౌండేషన్ వెల్లడించింది.గాజాలోని పాఠశాలలలో అధిక భాగం యుద్ధం కారణంగా దెబ్బతినడం లేదా పూర్తిగా ధ్వంసం కావడంతో లక్షలాది మంది పిల్లలు సాధారణ విద్యకు దూరమయ్యారని మానవతా సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఈ విరాళం ద్వారా చిన్నారులు మళ్లీ విద్యలోకి రావడానికి, వారి భవిష్యత్తుపై ఆశలను పునరుద్ధరించడానికి ఇది కీలకమైన అడుగుగా యూనిసెఫ్ పేర్కొంది.ఇదే సమయంలో స్వీడన్ ప్రభుత్వం కూడా గాజా చిన్నారుల సహాయార్థం యూనిసెఫ్‌కు 400 మిలియన్ స్వీడిష్ క్రోనర్లు ప్రకటించింది. దీంతో స్వీడన్ ప్రభుత్వం, అకేలియస్ ఫౌండేషన్ కలిసి గాజా చిన్నారుల కోసం ప్రకటించిన మొత్తం సహాయం 1.2 బిలియన్ స్వీడిష్ క్రోనర్లకు చేరుకుంది. దాతలకు ప్రపంచవ్యాప్తంగా అపర అభినందనలు అందుతున్నాయి.