Telugu News Power

నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది. -ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.

నిరంజన్ అంతిమయాత్ర
నాడు పవన్ కళ్యాణ్ తో నిరంజన్( మునుపటి చిత్రం)

విజయవాడ: జూలై,8( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన అభిమాని మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.కొద్ది రోజుల క్రితం హనుమకొండలో నిరంజన్ ఇంటికి వెళ్లి కలిసిన ఆ క్షణాలు ఇంకా నా మదిలో సజీవంగానే ఉన్నాయి. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూనే నా కోసం ఎదురుచూసిన ఆ చిన్నారి,నన్ను చూడగానే అతని ముఖంపై విరిసిన ఆ చిరునవ్వు, ఇవన్నీ ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
అతని శరీరం వ్యాధితో పోరాడినా, అతని మనసు మాత్రం అపారమైన ధైర్యంతో నిలిచింది. అంతటి బాధను అనుభవిస్తూ కూడా జీవితం పట్ల అతను చూపిన ఆశ, ఆత్మవిశ్వాసం ఎంతో విలువైనవన్నారు. అలాంటి ధైర్యవంతుడైన చిన్నారి ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోవడం ఎంతో బాధాకరమని విచారం వ్యక్తం చేశారు .నిరంజన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తీరని దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నానన్నారు.

ప్రియమైన నిరంజన్ నువ్వు చూపించిన చిరునవ్వు, ధైర్యం, నువ్వు పంచిన ప్రేమ నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి. నీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాని సంతాపం వ్యక్తం చేశారు. నిరంజన్ భౌతిక సాయం పై జనసేన జెండా కప్పి స్థానిక జనసేన నాయకులు అంత్యక్రియకు బుధవారం తీసుకువెళ్లారు.