న్యూఢిల్లీ: జూలై, 18( తెలుగు న్యూస్ పవర్. కామ్)
న్యూఢిల్లీలో శనివారంజరిగిన దేశీయ టూర్ ఆపరేటర్ల – అఖిల భారత చాప్టర్ చైర్మన్ ల సమావేశం –2026(ఏ డి టీ ఓ) లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. దేశీయ టూర్ ఆపరేటర్లతో ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలోని అపార అవకాశాలను పంచుకోవడం ఆనందంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నామని వెల్లడించారు. సింగిల్ విండో విధానం, పారదర్శక పాలన, పరిశ్రమలకు అనుకూల విధానాలతో పెట్టుబడిదారులకు పూర్తి భరోసా కల్పిస్తామని తెలిపారు .పర్యాటక రంగానికి టూర్ ఆపరేటర్లే నిజమైన భాగస్వాములన్నారు. వారు రూపొందించే వినూత్న ప్యాకేజీల ద్వారానే మన రాష్ట్రంలోని ఆధ్యాత్మిక, తీరప్రాంత, ప్రకృతి, బౌద్ధ, గ్రామీణ, సాంస్కృతిక వైభవం దేశవ్యాప్తంగా మరింత చేరువ అవుతుందని వారికి వివరించారు.ఆంధ్రప్రదేశ్‌ను సందర్శించి, సరికొత్త టూర్ ప్యాకేజీలను రూపొందించాలని కోరారు. ప్రపంచానికి రాష్ట్ర ప్రత్యేకతను పరిచయం చేయాలని వారికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పక్షాన దీనికి సంబంధించిన పూర్తి సహకారం, అవసరమైన ప్రోత్సాహకాలు అందిస్తామని భరోసా కల్పించారు.పర్యాటకం ద్వారా స్థానిక యువతకు ఉపాధి, మహిళలకు ఆర్థిక సాధికారత, గ్రామీణ కళలు–చేనేతలకు ప్రోత్సాహం, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కొత్త ఊపునిచ్చే దిశగా అందరం కలిసి ముందుకు సాగుతామని వారికి మంత్రి పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ లో పర్యాటకానికి అపార అవకాశాలు. -మంత్రి కందుల దుర్గేష్
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి దుర్గేష్