పాలకొల్లు:జూలై, 22(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక
శ్రీ ఏ.ఎస్.ఎన్. ఎం. ప్రభుత్వ కళాశాలలో ప్రపంచ మెదడు దినోత్సవం బుధవారం నిర్వహించారు.
కళాశాల జంతుశాస్త్ర (జువాలజీ) విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులకు మెదడు ఆరోగ్యంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల వైస్ ప్రిన్సిపాల్ టి. కృష్ణ అధ్యక్షత వహించారు. ఐక్యుఏసి కోఆర్డినేటర్ డాక్టర్ బూసి వెంకటస్వామి ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు. జువాలజీ విభాగాధిపతి డాక్టర్ ఎం. రామకృష్ణ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించి, నిర్వహించారు.
ఈ సందర్భంగా కళాశాల వైస్ ప్రిన్సిపాల్ టి. కృష్ణ మాట్లాడుతూ,ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి, నిద్రలేమి, జంక్ ఫుడ్ వల్ల మెదడు ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోందన్నారు. ప్రతి ఒక్కరూ నిత్యం వ్యాయామం చేయడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, కంటినిండా నిద్రపోవడం అలవాటు చేసుకోవాలని సూచించారు..ధూమపానం, మద్యపానం వంటి దురలవాట్లకు దూరంగా ఉంటేనే మెదడు సంబంధిత వ్యాధులను నివారించవచ్చునని పేర్కొన్నారు.
జువాలజీ విభాగాధిపతి డాక్టర్ ఎం. రామకృష్ణ మాట్లాడుతూ:
వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ న్యూరాలజీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జూలై 22న ప్రపంచ మెదడు దినోత్సవాన్ని నిర్వహిస్తారన్నారు. బ్రెయిన్ స్ట్రోక్, అల్జీమర్స్, పార్కిన్సన్స్, ఎపిలెప్సీ (ఫిట్స్) వంటి నాడీ సంబంధిత వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ రోజు ముఖ్య ఉద్దేశం అన్నారు.
విద్యార్థులు మానసిక ఉల్లాసం కోసం పుస్తక పఠనం, ధ్యానం, యోగా వంటి మంచి అలవాట్లను పెంపొందించుకోవాలని కోరారు.
విద్యార్థులందరూ మెదడు ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకురాలు హెప్సిబా రాణి, కళాశాల అధ్యాపక బృందం, సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
ఏ ఎస్ ఎన్ కళాశాలలో ప్రపంచ మెదడు దినోత్సవం.