Skip to main content

Telugu News Power

కామన్వెల్త్ పతక విజేతలతో ప్రధాని మోదీ భేటీ.. క్రీడాకారులకు అభినందనలు.

క్రీడాకారులతో ప్రధాని మోడీ

న్యూఢిల్లీ:ఆగస్టు, 9( తెలుగు న్యూస్ పవర్. కామ్) గ్లాస్గోలో జరిగిన 2026 కామన్వెల్త్ గేమ్స్‌లో అద్భుత ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన భారత క్రీడాకారులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. న్యూఢిల్లీలోని తన నివాసంలో కామన్వెల్త్ పతక విజేతలతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా ఆదివారం సమావేశమయ్యారు.
క్రీడాకారుల విజయాలను ప్రశంసించిన ప్రధాని వారి కృషి, పట్టుదల, క్రమశిక్షణ దేశంలోని యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అంతర్జాతీయ వేదికపై భారత క్రీడా ప్రతిభను చాటినందుకు అథ్లెట్లను అభినందించారు.
“ఆడేవారే ఎదుగుతారు” అనే సందేశాన్ని ప్రధాని మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. క్రీడలను మరింత ప్రోత్సహించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. యువత పెద్ద సంఖ్యలో క్రీడల్లో పాల్గొనేలా వాతావరణాన్ని కల్పించడం దేశ భవిష్యత్తుకు ఎంతో ముఖ్యమని తెలిపారు.
గ్లాస్గోలో జూలై 23 నుంచి ఆగస్టు 2 వరకు జరిగిన 2026 కామన్వెల్త్ గేమ్స్‌లో భారత క్రీడాకారులు పలు విభాగాల్లో సత్తా చాటారు. ఈ విజయాలు భారత క్రీడా రంగంలో పెరుగుతున్న ప్రతిభకు నిదర్శనంగా నిలిచాయి.
2030 కామన్వెల్త్ గేమ్స్‌కు భారత్ ఆతిథ్యం ఇస్తుందన్నారు.
అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఈ క్రీడా సంబరాలు భారత్‌కు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మారనున్నాయి. 20 ఏళ్ల తర్వాత భారత్ మరోసారి కామన్వెల్త్ గేమ్స్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది.
భారత క్రీడాకారుల విజయాలు దేశానికి గర్వకారణమని, భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ విజయాలు సాధించాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.